ఆసీస్‌కు విండీస్‌ సవాల్‌

6 Jun, 2019 05:18 IST|Sakshi

రెండో విజయంపై ఇరుజట్ల దృష్టి

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు ప్రేక్షకులను రంజింపచేయనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ల మధ్య నేడు మ్యాచ్‌ జరుగనుంది. ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో ఇప్పటికే చెరో విజయాన్ని సాధించి ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలో దిగనుండటంతో ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో గురువారం పరుగుల వరద పారే అవకాశముంది. వార్నర్, స్మిత్, ఫించ్, ఖాజా, మ్యాక్స్‌వెల్‌లతో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీసేందుకు విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. పాక్‌తో తొలి మ్యాచ్‌లో విండీస్‌ పేస్‌ ద్వయం జేసన్‌ హోల్డర్, ఒషాన్‌ థామస్‌ విజృంభించారు.

దీంతో పాక్‌ 105 పరుగులకే కుప్పకూలింది. క్రిస్‌ గేల్‌ తొలి మ్యాచ్‌లో తన పవర్‌ చాటుకున్నాడు. ఆండ్రీ రసెల్, బ్రేవో, హెట్‌మైర్‌ బ్యాట్లను ఝళిపిస్తే భారీ స్కోరు ఖాయం. అటువైపు విండీస్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫించ్‌ బృందం తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది జైత్రయాత్ర మొదలు పెట్టింది. ఆరోన్‌ ఫించ్, డేవిడ్‌ వార్నర్‌ అర్ధసెంచరీలతో చెలరేగారు. అన్ని రంగాల్లో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నప్పటికీ మైదానంలో వ్యూహాలను సరిగ్గా అమలు చేసే జట్టునే విజయం వరిస్తుందని ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ భావిస్తున్నాడు.   

మరిన్ని వార్తలు