మళ్లీ చెలరేగిన గేల్‌

3 Mar, 2019 14:02 IST|Sakshi

సెయింట్‌ లూసియా: వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ మళ్లీ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో వన్డేలో గేల్‌ విజృంభించి ఆడాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించి వెస్టిండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయ్యింది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో వన్డేలో విండీస్‌ గెలుపొందింది. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాల్గో వన్డేలో ఇంగ్లండ్‌ను విజయం వరించింది. దాంతో ఐదో వన్డే విండీస్‌కు కీలకం మారింది. ఈ మ్యాచ్‌ను గెలిస్తేనే సిరీస్‌ను సమం చేసుకునే పరిస్థితుల్లో విండీస్‌ ఆద్యంతం ఆకట్టుకుంది.
(ఇక్కడ చదవండి: సందిగ్ధంలో క్రిస్‌ గేల్‌)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ను 28.1 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్‌ చేయగా, ఆపై విండీస్‌ 12.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా తన బ్యాటింగ్‌ పవర్‌ను మరోసారి చూపెట్టాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి వెస్టిండీస్‌ తరఫున ఫాస్టెస్ట్‌ అర్థ శతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గేల్‌ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలి వన్డేలో 3 ఫోర్లు, 12 సిక్సర్లతో 135 పరుగులు చేసిన గేల్‌.. రెండో వన్డేలో 4 సిక్సర్లు, 1 ఫోర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాల్గో వన్డేలో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో గేల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు.
 

మరిన్ని వార్తలు