తొలి టెస్టు.. విండీస్‌ విలవిల

5 Oct, 2018 17:47 IST|Sakshi

రాజ్‌కోట్‌: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విలవిల్లాడుతోంది. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విండీస్‌ ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(2), కీరన్‌ పావెల్‌(1)లు ఐదు ఓవర్లలోపే పెవిలియన్‌ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌(10) కూడా ఔటయ్యాడు. ఈ తరుణంలో షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌(10) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. అంబ్రిస్‌తో సమన‍్వయం లోపం కారణంగా హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు. ఇద్దరూ ఆటగాళ్లు ఒకే ఎండ్‌లోకి వెళ్లిన క్రమంలో హెట్‌మెయిర్‌ను రవీంద్ర జడేజా రనౌట్‌ చేశాడు. అటు తర్వాత అంబ్రిస్‌(12)ను జడేజా అవుట్‌ చేశాడు. దాంతో విండీస్‌ 50 పరుగులలోపే సగం వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ ఆరువికెట్ల నష్టానికి 94 పరుగుల చేసింది. విండీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో షమీ రెండు వికెట్లు సాధించగా, కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, జడేజాలకు తలో వికెట్‌ లభించింది. 

అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక‍్లేర్‌ చేసింది. రవీంద్ర జడేజా శతకం పూర్తి చేసుకున్న అనంతరం భారత కెప్టెన్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. జడేజా 132 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు.  364/4 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి రోజు యువకెరటం పృథ్వీ షా శతకం సాధించగా.. పుజారా(86)  హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇక రెండో రోజు ఆటలో కోహ్లి శతకం సాధించగా.. రిషబ్‌ పంత్‌(92) శతకం చేజార్చుకున్నాడు. 

జడేజా సెంచరీ.. కోహ్లి సేన డిక్లేర్‌

మరిన్ని వార్తలు