విన్నీపెగ్‌ హాక్స్‌ ‘సూపర్‌’

12 Aug, 2019 11:48 IST|Sakshi

ఒంటారియో: గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో విన్నిపెగ్‌ హాక్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. వాంకోవర్‌ నైట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్‌ పోరులో విన్నీపెగ్‌ సూపర్‌ ఓవర్‌లో చాంపియన్‌గా నిలిచింది.  ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను తేల్చారు. ఇక్కడ వాంకోవర్‌ నైట్స్‌ ముందుగా సూపర్‌ ఓవర్‌ ఆడి రెండు వికెట్ల నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది. ఇందులో రసెల్‌ ఏడు పరుగులు సాధించాడు. కాగా, 10 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విన్నీపెగ్‌ ఇంకా రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. 

క్రిస్‌ లిన్‌ ఐదు పరుగులు చేయగా, రహ్మాన్‌ పరుగు చేశాడు. కాగా, రసెల్‌ వేసిన సూపర్‌ ఓవర్‌ మూడో బంతికి నాలుగు పరుగులు బైస్‌ రూపంలో రావడంతో విన్నీపిగ్‌ విజయం సులభతరమైంది.ముందుగా బ్యాటింగ్‌ చేసిన విన్నీపెగ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షైమన్‌ అన్వర్‌(90) రాణించాడు. అటు తర్వాత వాన్‌కూవర్‌ నైట్స్‌ కూడా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులే చేసింది. నైట్స్‌ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌(64) హాఫ్‌ సెంచరీ సాధించగా, రసెల్‌(46)లు చివరి వరకూ క్రీజ్‌లో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. మ్యాచ్‌  టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇక్కడ విన్నీపెగ్‌ విజేతగా నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు