యూసుఫ్‌ పఠాన్‌ నిర్ణయంపై వెనక్కి

16 Feb, 2017 00:05 IST|Sakshi
యూసుఫ్‌ పఠాన్‌ నిర్ణయంపై వెనక్కి

హాంకాంగ్‌ టి20 లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఉపసంహరణ

ముంబై: విదేశీ టి20 లీగ్‌లలో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందే అవకాశం యూసుఫ్‌ పఠాన్‌ చేజారింది. మార్చి 8 నుంచి 12 వరకు హాంకాంగ్‌లో జరిగే టి20 లీగ్‌లో పాల్గొనేందుకు యూసుఫ్‌ పఠాన్‌కు గతవారం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అతనికి నిరభ్యంతర పత్రం కూడా జారీ చేసింది. దాంతో ఈ లీగ్‌లో కౌలూన్‌ కాంటోన్స్‌ జట్టు యూసుఫ్‌ పఠాన్‌తో ఒప్పందం చేసుకుంది. యూసుఫ్‌ పఠాన్‌కు పచ్చ జెండా ఊపిన తర్వాత భారత్‌కే చెందిన ఇతర క్రికెటర్లు కూడా హాంకాంగ్‌ టి20 లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐని కోరారు.

ఒకేసారి చాలామంది క్రికెటర్లు ఇలా అనుమతి కోరడంతో పునరాలోచనలో పడిన బీసీసీఐ యూసుఫ్‌ పఠాన్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అతనితోపాటు ఇతర క్రికెటర్లు కూడా విదేశీ టి20 లీగ్‌లలో ఆడొద్దని ఆదేశించింది. ఇటీవలే దినేశ్‌ కార్తీక్‌ కరీబియన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి దరఖాస్తు చేసుకోగా దానిని తిరస్కరించింది. ఇప్పటివరకు భారత్‌ నుంచి ఏ క్రికెటర్‌ కూడా విదేశీ టి20 లీగ్‌లలో ఆడలేదు. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధన మాత్రం ఇటీవలే ఆస్ట్రేలియాలోని బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌లో ఆడినా... కొన్ని మ్యాచ్‌ల తర్వాత బీసీసీఐ వీరిద్దరినీ వెనక్కి పిలిచింది.

మరిన్ని వార్తలు