మైదానంలోకి మహిళా అతిథి.. డీకాక్‌ దరహాసం

17 Feb, 2020 14:45 IST|Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో గెలిచిన ఇంగ్లండ్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (22 బంతుల్లో 57 నాటౌట్‌; 7 సిక్స్‌లు)కు జతగా  జోస్‌ బట్లర్‌ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. 

మైదానంలోకి మహిళా అతిధి రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కల్గింది. జేసన్‌ రాయ్‌(7) తొలి వికెట్‌గా ఔటైన తర్వాత ఒక మహిళ మైదానంలో పరుగెత్తుకొచ్చింది. అయితే  సూపర్‌ హీరో డ్రెస్‌ ధరించిన ఆ మహిళ ఎందుకు స్టేడియంలోకి వచ్చిందో సఫారీ కెప్టెన్‌ డీకాక్‌కు ముందుగానే అర్థమైపోయింది. ఆమె రాకకు తన దరహాసంతోనే డీకాక్‌ స్వాగతం పలికాడు. (ఇక్కడ చదవండి: మోర్గాన్‌ మెరుపులు)

వాతావరణ కాలుష్యంపై ఆఫ్రికాలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఒక గ్రూప్‌.. మ్యాచ్‌ చూడటానికి సెంచూరియన్‌కు విచ్చేసింది. ప్రధానంగా క్రికెటర్ల ద్వారా తమ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సదరు గ్రూప్‌ మ్యాచ్‌ చూడటానికి స్టేడియానికి వచ్చింది. దీనిలో భాగంగా సదరు మహిళా యాక్టివిస్ట్‌.. స్టేడియంలో వచ్చి కాలుష్యంపై డీకాక్‌తో కాసేపు ముచ్చటించింది. ఆ క్రమంలోనే డీకాక్‌కు ఒక మాస్క్‌ను ఇవ్వగా, అదే సమయంలో డేల్‌ స్టెయిన్‌ కూడా అక్కడ వచ్చాడు. దాంతో స్టెయిన్‌ కూడా ఒక ముఖానికి దరించే మాస్క్‌ను అందించి గాలిలో క్రమేపీ తగ్గుతున్న నాణ్యత గురించి వివరించింది. అంతకుముందు ఈ గ్రూప్‌లో కొంతమంది ఫ్లడ్లలైట్లకు సైతం ఒక పసుపు పచ్చని బ్యానర్‌ను కట్టి తమ నిరసనను తెలియజేశారు. 

మరిన్ని వార్తలు