విండీస్‌ను ఊడ్చేశారు..

21 Nov, 2019 11:20 IST|Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళలు జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పటికే నాలుగు టీ20ల్లో జయభేరి మోగించిన టీమిండియా.. గురువారం జరిగిన నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో గెలుచుకుంది. సిరీస్‌ ఆరంభం నుంచి ఎదురేలేని టీమిండియా టీ20 చాంపియన్‌ను గజగజా వణికించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ రోడ్రిగ్స్‌(50; 56 బంతుల్లో 3ఫోర్లు), వేద కృష్ణమూర్తి(57 నాటౌట్‌; 48 బంతుల్లో 4ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 73 పరుగులే చేసి ఓటమిపాలైంది. కిషోనా నైట్(22) ఓ మోస్తారుగా రాణించగా మిగతా బ్యాటర్స్‌ దారుణంగా విఫలమయ్యారు.  భారత బౌలర్లలో అనూజా పాటిల్‌ రెండు, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, పూజా, హర్లీన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.   

రాణించిన రోడ్రిగ్స్‌, వేద
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. షెఫాలీ వర్మ(9), స్మృతి మంధాన(7) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌, వేద కృష్ణమూర్తి జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. తొలుత ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో స్కోర్‌ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్‌ చివరి రెండో బంతికి రోడ్రిగ్స్‌ వెనుదిరిగింది. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శిచంలేదు. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో విండీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. 

>
మరిన్ని వార్తలు