-

గెలిస్తే.. సిరీస్‌ మనదే

11 Oct, 2019 10:02 IST|Sakshi

వడోదర: దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో గెలిచి జోరు మీదున్న టీమిండియా మహిళల జట్టు మరో సమరానికి సిద్దమైంది. శుక్రవారం వడోదరలోని రిలయన్స్‌ స్టేడియంలో సఫారీ జట్టుతో రెండో వన్డేలో తలపడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆరాడపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

మ్యాచ్‌ జరిగే కొద్ది నెమ్మదిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్‌ గెలిచిన సారథి మిథాలీ రాజ్‌ ఛేజింగ్‌ వైపు మొగ్గు చూపింది. గాయం కారణంగా స్మృతి మంధాన స్థానంలో జట్టులోకి వచ్చిన పూజా వస్త్రాకర్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుదిజట్టులోకి తీసుకోలేదు. ఇక అరంగేట్రపు మ్యాచ్‌లోనే అదరగొట్టిన ప్రియా పూనియాపై అందరి దృష్టి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ రాణించి టీమిండియాలో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలని ప్రియ భావిస్తోంది. 

తొలి వన్డేలో ఓపెనర్లు రాణించడంతో మిగతా బ్యాటర‍్లకు అవకాశం రాలేదు. మిథాలీ రాజ్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, రోడ్రిగ్స్‌లతో కూడిన బ్యాటింగ్‌ లైన్‌పై పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా మైదానంలో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక జులన్‌ గోస్వామి నేతృత్వంలోని బౌలింగ్‌ విభాగం దుర్బేద్యంగా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. టీ20 సిరీస్‌, తొలి వన్డే ఓటమితో సఫారీ జట్టు ఢీలా పడింది. అయితే రెండో వన్డేలో పుంజుకొని విజయం సాధించాలని ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఓపెనర్లిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు