‘లూడో కలిపింది అందరినీ’

14 Apr, 2020 06:11 IST|Sakshi
లూడో ఆడుతూ

భారత మహిళా క్రికెటర్ల ఆన్‌లైన్‌ ఆటలు

ముంబై: కరోనా నేపథ్యంలో అసలు ఆటలన్నీ ఆగిపోవడంతో ప్లేయర్లంతా ఇతర వ్యాపకాల్లో బిజీగా మారుతున్నారు. ఇంటి డ్రాయింగ్‌ రూమ్‌లో ఆర్చరీ రేంజ్‌లు, వర్చువల్‌ షూటింగ్‌ రేంజ్‌లలో తమ సామర్థ్యం మెరుగుపర్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, సరదాగా ఆన్‌లైన్‌ క్రీడలతో సమయం గడుపుతున్నవారు మరికొందరు. భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వీరంతా ఆన్‌లైన్‌లో కలిసికట్టుగా లూడో గేమ్‌ను ఆడుతున్నారు. బ్యాట్, బంతి పక్కకు వెళ్లిపోగా పాచికలే ఇప్పుడు వారికి పరమపూజ్యంగా మారిపోయాయి. జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ విషయాన్ని వెల్లడించింది. ‘మేం ఫ్రెండ్స్‌ అంతా కలిసి ఆన్‌లైన్‌లో లూడో గేమ్‌ను ఆడుతున్నాం. ఇందులో జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు.

మైదానంలో అందరితో కలిసి ఉండే తరహాలోనే ఇప్పుడు దీని ద్వారా కూడా అదే బంధం, సాన్నిహిత్యం కొనసాగిస్తున్నట్లుగా ఉంది. దీంతో పాటు ఫిట్‌గా ఉండటం కూడా కీలకం. మా ట్రైనర్‌ మాకందరికీ విడివిడిగా పంపించిన ట్రైనింగ్‌ షెడ్యూల్‌ను అనుసరిస్తూ మేమంతా ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం’ అని స్మృతి వెల్లడించింది. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఎడంచేతి వాటం బ్యాటర్‌ లాక్‌డౌన్‌లో తాను ఎలా సమయం గడుపుతున్నానో చెప్పింది. ‘కుటుంబసభ్యులందరం సరదాగా గడుపుతున్నాం. పేకాట, ఇంటి పని, వంట పని, సోదరుడితో అల్లరి ఎలాగూ ఉన్నాయి. సినిమాలంటే బాగా ఇష్టం కాబట్టి వారానికి రెండు, మూడు సినిమాలు చూస్తున్నాను. అన్నింటికి మించి నాకు ఇష్టమైన వ్యాపకం నిద్ర. రోజుకు కనీసం 10 గంటలు పడుకుంటున్నాను. దాని వల్ల మిగిలిన రోజంతా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తోంది’ అని స్మృతి చెప్పింది.   

ఇంటి పని చేస్తూ స్మృతి

మరిన్ని వార్తలు