భారత అమ్మాయిలకు తొలి గెలుపు

23 Mar, 2017 10:50 IST|Sakshi
భారత అమ్మాయిలకు తొలి గెలుపు

న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత అమ్మాయిలు తొలి విజయం సాధించారు. గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1 తేడాతో పసిఫిక్‌ ఓసియానియా జట్టుపై గెలుపొందింది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో సాల్సా పరాగ్‌ అహీర్‌ (భారత్‌) 6–1, 6–1తో నైయా గుట్టన్‌పై గెలిచి భారత్‌కు శుభారంభాన్నిచ్చింది. రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ షేక్‌ హుమేరా 1–6, 2–6తో కరోల్‌ యంగ్‌ సు లీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది.

 

అయితే నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో షేక్‌ హుమేరా–సాల్సా పరాగ్‌ ద్వయం 6–4, 6–0తో నైయా గుట్టన్‌–కరోల్‌ యంగ్‌ సు లీ జంటపై గెలుపొంది మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి గ్రూప్‌ ‘డి’ లో 3 పాయింట్లతో చైనీస్‌ తైపీ అగ్రస్థానంలో నిలవగా... 2 పాయింట్లతో ఉజ్బెకిస్థాన్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. కేవలం ఒక మ్యాచ్‌లో నెగ్గిన భారత్‌ (1) మూడో స్థానంలో, పసిఫిక్‌ ఓసియానియా చివరి స్థానంలో నిలిచాయి. గురువారం 9 నుంచి 16 స్థానాల వరకు జరిగే వర్గీకరణమ్యాచ్‌లో భారత్‌... కజకిస్తాన్‌తో తలపడుతుంది.

 

మరిన్ని వార్తలు