‘ఆసియా’ మనదే...

6 Nov, 2017 02:24 IST|Sakshi

13 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ చాంపియన్‌గా భారత్‌

ఫైనల్లో చైనాపై 5–4తో విజయం

టోర్నీ ‘బెస్ట్‌ గోల్‌కీపర్‌’గా సవిత

వచ్చే ఏడాది మహిళల ప్రపంచకప్‌ టోర్నీకీ అర్హత

పదమూడేళ్ల నిరీక్షణ ఫలించింది. భారత మహిళల జట్టు రెండోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. కొన్నాళ్లుగా భారత పురుషుల జట్టు సాధిస్తున్న విజయాలకు దీటుగా మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆసియా కప్‌లో అజేయంగా నిలవడమేకాకుండా సగర్వంగా కప్‌ను హస్తగతం చేసుకుంది. రెండు వారాల క్రితం ఢాకాలో జరిగిన పురుషుల ఆసియా కప్‌లో భారత జట్టు టైటిల్‌ సొంతం చేసుకోగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా విజేతగా నిలువడంతో హాకీ ఇండియా ‘డబుల్‌’ ధమాకా సృష్టించింది.
   
కకమిగహర (జపాన్‌): కొత్త కోచ్‌ హరేంద్ర సింగ్‌ పర్యవేక్షణలో భారత మహిళల జట్టు అద్భుత ఫలితం సాధించింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో రాణి రాంపాల్‌ నాయకత్వంలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్‌’లో 5–4తో చైనాపై విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున 25వ నిమిషంలో నవ్‌జ్యోత్‌ కౌర్‌ గోల్‌ చేయగా... చైనా జట్టుకు తియాన్‌తియాన్‌ లియో గోల్‌ సాధించింది. స్కోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. షూటౌట్‌లో చైనా క్రీడాకారిణుల రెండు షాట్‌లను భారత గోల్‌కీపర్‌ సవిత అడ్డుకొని జట్టుకు విజయం ఖాయం చేసింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా చాంపియన్‌ కావడం విశేషం. టోర్నీ మొత్తంలో కేవలం ఐదు గోల్స్‌ మాత్రమే సమర్పించుకున్న సవిత ‘బెస్ట్‌ గోల్‌కీపర్‌’ అవార్డును గెల్చుకుంది. ఈ విజయంతో ఆసియా చాంపియన్‌ హోదాలో భారత్‌ వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. 2010 తర్వాత భారత్‌ ప్రపంచకప్‌కు అర్హత పొందింది.
 
ఫైనల్‌ చేరే క్రమంలో అజేయంగా నిలిచిన భారత్‌కు తుది పోరులో చైనా నుంచి గట్టిపోటీనే లభించింది. రెండో నిమిషంలోనే చైనాకు పెనాల్టీ కార్నర్‌ వచ్చింది. అయితే గోల్‌కీపర్‌ సవిత దానిని అడ్డుకోగా... తిరిగి వచ్చిన బంతిని దీప్‌ గ్రేస్‌ ఎక్కా బయటకు పంపించింది. ఆ తర్వాత నవ్‌నీత్‌ కౌర్, వందన కటారియా చక్కని సమన్వయంతో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోనికి చొచ్చుకు వెళ్లారు. కానీ చైనా రక్షణ పంక్తిని బోల్తా కొట్టించలేకపోయారు. తొలి క్వార్టర్‌ చివరి క్షణాల్లో చైనాకు రెండో పెనాల్టీ కార్నర్‌ వచ్చింది. దీనిని కూడా భారత గోల్‌కీపర్‌ సవిత నిర్వీర్యం చేసింది. దాంతో తొలి క్వార్టర్‌లో రెండు జట్లు గోల్‌ చేయలేకపోయాయి.  
రెండో క్వార్టర్‌లో భారత్‌ తమ దాడుల్లో పదును పెంచింది. 17వ నిమిషంలో నవ్‌జ్యోత్‌ డైవ్‌ చేస్తూ కొట్టిన షాట్‌... కెప్టెన్‌ రాణి రాంపాల్‌ షాట్‌లు లక్ష్యానికి దూరంగా వెళ్లాయి. ఎనిమిది నిమిషాల తర్వాత రాణి రాంపాల్‌ అందించిన పాస్‌ను నవ్‌జ్యోత్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లోనూ భారత్‌ ఆధిక్యంలో ఉండగా... చివరి క్వార్టర్‌లోని 47వ నిమిషంలో చైనా గోల్‌ సాధించి స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్‌ చేసేందుకు విశ్వప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయాయి. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 1–0తో జపాన్‌పై విజయం సాధించింది.  

ప్రశంసల వెల్లువ...
ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌... దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, సినీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు మహిళల జట్టును అభినందించారు. ‘ఆసియా కప్‌ నెగ్గిన భారత మహిళల జట్టుకు అభినందనలు. ఇదే ప్రదర్శనను వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లోనూ పునరావృతం చేయాలని ఆశిస్తున్నాను’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

పెనాల్టీ షూటౌట్‌ సాగిందిలా..
చైనా                        స్కోరు                  భారత్‌
4 లియాంగ్‌ మియు       11                  4 రాణి రాంపాల్‌    
4 జు వెన్యు                  22                  4 మోనిక
4 వాంగ్‌ నా                  33                  4 నవ్‌జ్యోత్‌ కౌర్‌    
4 చెన్‌ యి                   44                   4 లిలిమా మింజ్‌    
7కియుజియా క్యూ        44                   7నవ్‌నీత్‌ కౌర్‌    
7లియాంగ్‌ మియు         45                  4 రాణి రాంపాల్‌

భారత్‌ జైత్రయాత్ర సాగిందిలా..
తొలి లీగ్‌ మ్యాచ్‌        :    సింగపూర్‌పై 10–0తో గెలుపు
రెండో లీగ్‌ మ్యాచ్‌       :    చైనాపై 4–1తో విజయం
మూడో లీగ్‌ మ్యాచ్‌    :    మలేసియాపై 2–0తో గెలుపు
క్వార్టర్‌ ఫైనల్‌           :    కజకిస్తాన్‌పై 7–1తో ఘనవిజయం
సెమీఫైనల్‌              :    జపాన్‌పై 4–2తో గెలుపు
ఫైనల్‌                    :    చైనాపై 5–4తో విజయం

ఆసియా కప్‌ విజేతగా నిలువడం భారత్‌కిది రెండోసారి. తొలిసారి 2004లో టీమిండియా ఈ టైటిల్‌ను సాధించింది. మరో రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009), రెండుసార్లు మూడో స్థానంలో (1994, 2013), మరో రెండుసార్లు నాలుగో స్థానంలో (1989, 2007)నిలిచింది.

మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా ప్రదర్శన ద్వారా, ఆసియా చాంపియన్‌ హోదాలో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందినందుకు గర్వంగా ఉంది. మా జట్టులో చాలా మంది యువ క్రీడాకారిణులున్నారు. వారందరూ చివరి క్షణం వరకు అద్భుతంగా పోరాడారు. చైనాతో ఫైనల్‌ పోరు హోరాహోరీగా సాగింది. ఏ దశలోనూ మేము నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఆడాం. సడెన్‌డెత్‌లో చైనా క్రీడాకారిణి షాట్‌ను గోల్‌కీపర్‌ సవిత అడ్డుకోవడం... తర్వాతి షాట్‌ను నేను గోల్‌గా మలచడంతో చాలా ఆనందంగా ఉంది. మాకు అత్యుత్తమ సౌకర్యాలు అందిస్తున్న హాకీ ఇండియాకు, భారత స్పోర్ట్స్‌ అథారిటీకి జట్టు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ ఇదే జోరును కొనసాగించి పతకాలు గెలవాలని పట్టుదలతో ఉన్నాం.    
– రాణి రాంపాల్, భారత కెప్టెన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు