మరో విజయంపై దృష్టి

5 Jul, 2017 03:21 IST|Sakshi
మరో విజయంపై దృష్టి

డెర్బీ: వరుసగా మూడు విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌... ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ దారుణ పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న శ్రీలంక... మహిళల ప్రపంచకప్‌లో భాగంగా నేడు ముఖాముఖి పోరులో తలపడనున్నాయి. తాజా విజయాలతో పాటు తాము ఆడిన చివరి నాలుగు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత జట్టు తమ జోరును మరింతగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.

ఇప్పుడు తమకన్నా బలహీనంగా కనిపిస్తున్న లంకపై కూడా నెగ్గితే సెమీఫైనల్స్‌ అవకాశాలు మరింత మెరుగవుతాయి. భారత్‌ ప్రస్తుతం ఆరు పాయింట్లతో టాపర్‌గా ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్న భారత అమ్మాయిలు ఫేవరెట్‌గానే కనిపిస్తుండగా... అన్నింట్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న లంక ఏమేరకు పోటీనివ్వగలదో వేచి చూడాలి. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోకుండా ఆడాల్సిన అవసరం ఉందని కెప్టెన్‌ మిథాలీ అభిప్రాయపడుతోంది.

ఊపు మీదున్న భారత్‌
ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్‌ రౌత్, మిథాలీ రాజ్‌ రూపంలో జట్టుకు పటిష్ట లైనప్‌ ఉంది. ముఖ్యంగా స్మృతి తన కెరీర్‌లోనే అద్భుత ఫామ్‌లో ఉంది. మూడు మ్యాచుల్లో ఆమె 198 పరుగులు చేసింది. ఇక పేసర్‌ జులన్, ఆఫ్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ ప్రభావం చూపగలిగే బౌలర్లే. మరోవైపు ఇప్పటిదాకా విజయం రుచి చూడని లంక మరోసారి చమరి ఆటపట్టుపైనే ఆధారపడింది. కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 53, ఆసీస్‌పై అజేయంగా 178 పరుగులతో ఆమె ఆకట్టుకుంది. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ జట్టు దాదాపు 200కు పైగా పరుగులు చేయగలిగింది. భారత్‌పై కూడా ఇదే రీతిన చెలరేగి ఫలితం దక్కించుకుంటామని కెప్టెన్‌ ఇనోక రణవీర పేర్కొంది.

జట్లు (అంచనా): భారత్‌: మిథాలీ (కెప్టెన్‌), పూనమ్‌ రౌత్, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్, దీప్తి, మోనా మేశ్రమ్, సుష్మా వర్మ, జులన్‌ గోస్వామి, మాన్సి జోషి, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌. శ్రీలంక: ఇనోక రణవీర (కెప్టెన్‌), నిపుణి హన్సిక, హాసిని పెరీరా, చమరి ఆటపట్టు, శశికళ, దిలాని, హర్షిత, ఒషాడి, ఇషాని, అమ కంచన, శ్రీపాలి.

మరిన్ని వార్తలు