వచ్చే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌

21 Jun, 2019 04:58 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఓ అడుగు పడింది. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా నిర్వహించే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరుస్తూ కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ), ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించింది. ‘ఇది మహిళా క్రికెట్‌ విశ్వవ్యాప్తం కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాత మరెప్పుడూ క్రికెట్‌ ఇందులో భాగం కాలేదు.  

మరిన్ని వార్తలు