తొలి వన్డేలో భారత్‌ విజయం

10 Oct, 2019 08:16 IST|Sakshi
ఫైల్‌ఫోటో

మెరిసిన ప్రియ, రోడ్రిగ్స్‌

వన్డే సిరీస్‌లో భారత్‌ బోణీ 

తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపు

వడోదర: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 3–1తో దక్కించుకున్న భారత మహిళల జట్టు మూడు వన్డే సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత సఫారీ మహిళల జట్టు భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో 164 పరుగులకే ఆలౌట్‌ కాగా, అనంతరం జెమీమా రోడ్రిగ్స్‌(55: 65 బంతుల్లో 7 ఫోర్లు), ప్రియ పునియా(75 నాటౌట్‌: 124 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరవడంతో భారత్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపు అందుకుంది. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం లభించలేదు. పేసర్‌ జులన్‌ గోస్వామి ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ లిజెల్లీ లీ(0)ని వికెట్ల ముందు దొరక బుచ్చుకుంది. అనంతరం లారా వొల్వార్ట్‌(39), త్రిష చెట్టి(14) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, వొల్వార్టన్‌ దీప్తిశర్మ, త్రిష చెట్టి, మిగ్యున్‌ డు ప్రీజ్‌(16)ను ఏక్తా బిష్త్‌ వెనక్కి పంపారు.

కాసేపటికే శిఖా పాండే బౌలింగ్‌లో సునె లూస్‌ (22), నదిన్‌ డి క్లెర్క్‌(0) ఔట్‌ కాగా, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌(3)ను పూనమ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చింది. దీంతో 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును నొందుమిసొ షన్గాసె (4), సెఖుఖునె(6), అయబొంగ ఖాఖ(1నాటౌట్‌)తో కలసి మరిజానె కప్‌(54: 64 బంతుల్లో 6 ఫోర్లు) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగింది. భారత బౌలర్లలో గోస్వామి 3 వికెట్లు తీయగా, శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మకు 1 వికెట్‌ దక్కింది. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. గాయం కారణంగా వన్డే సిరీస్‌కు మంధాన దూరం కావడంతో అరంగేట్రం చేసిన ప్రియ పునియా(75 నాటౌట్‌: 124 బంతుల్లో 8 ఫోర్లు) అవకాశాన్ని అందిపుచ్చుంది. జెమీమా రోడ్రిగ్స్‌(55: 65 బంతుల్లో 7 ఫోర్లు)తో కలసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభం అందించింది. అనంతరం పూనమ్‌ రౌత్‌(16: 38 బంతుల్లో 3 ఫోర్లు)తో కలసి రెండో వికెట్‌కు 45 పరుగులు, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(11 నాటౌట్‌)తో కలసి మూడో వికెట్‌కు అజేయంగా 37 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చింది. ప్రియ పునియాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నొందుమిసొ షన్గాసె, నదిన్‌ డి క్లెర్క్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

మరిన్ని వార్తలు