సెమీస్‌కా? ఇంటికా?

15 Jul, 2017 08:08 IST|Sakshi
సెమీస్‌కా? ఇంటికా?

న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమైన భారత్‌
కలవరపెడుతున్న బ్యాటింగ్, ఫీల్డింగ్‌
ఒత్తిడిలో మిథాలీ రాజ్‌ బృందం


అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయ విజయాలతో మిథాలీ సేన అందరికంటే ముందే సెమీస్‌ చేరుతుందనుకుంటే... గత రెండు మ్యాచ్‌ల పరాభవం భారత మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. దీంతో నాకౌట్‌ చేరాలంటే న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ తిరిగి గాడిన పడితేనే కివీస్‌ను పడేయొచ్చు. లేదంటే టీమిండియాకు మరోసారి లీగ్‌ దశతోనే ప్రపంచ కప్‌ ముచ్చట ముగుస్తుంది. ఒకవేళ వరుణుడు కరుణించి మ్యాచ్‌ రద్దయితే మాత్రం భారత్‌కు సెమీఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది.

డెర్బీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఇంకా లీగ్‌ దశ ముగియలేదు. కానీ భారత్‌ మాత్రం నాకౌట్‌కు ముందే నాకౌట్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. మెగా ఈవెంట్‌లో శనివారం క్వార్టర్స్‌ను తలపించే లీగ్‌ పోరులో మిథాలీ సేన... న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరా యి. దీంతో మిగిలున్న ఒక బెర్త్‌ కోసం భారత్, కివీస్‌లు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 8, న్యూజిలాండ్‌ ఖాతాలో 7 పాయింట్లున్నాయి. వర్షం కారణంగా నేటి మ్యాచ్‌ రద్దయితే మాత్రం రెండు జట్లకు చెరో పాయింట్‌ లభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌ 9 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

నిలకడలేమి...
ప్రారంభంలో అద్భుతమైన బ్యాటింగ్‌తో గెలుస్తూ వచ్చిన భారత్‌ గత రెండు మ్యాచ్‌ల్లో నిలకడలేని బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్‌ స్మృతి మంధన మొదటి రెండు మ్యాచ్‌ల్లో వీరవిహారం చేసింది. కానీ ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఈమెతో పాటు కీలక సమయాల్లో ఎవరో ఒకరిద్దరు మినహా సమష్టిగా రాణించకపోవడంతో భారత్‌ స్కోరు వేగం మందగిస్తోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఒక్క మిథాలీ రాజే నిలకడను కనబరిచింది. పూనమ్‌ రౌత్, హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ వీరంతా తలా ఒకట్రెండు మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కానీ తప్పక గెలవాల్సిన పోరులో వీరంతా కలిసి సర్వశక్తులు ఒడ్డాలి. భారత అమ్మాయిలు ఫీల్డింగ్‌ లోపాల్ని కూడా సవరించుకోవాలి.

తొలి మూడు మ్యాచ్‌ల్లోనే ఏకంగా ఎనిమిది క్యాచ్‌ల్ని నేలపాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండ్‌ షోతో ప్రత్యర్థిని కట్టడి చేయాలి. లేదంటే లీగ్‌ దశతోనే ఇంటికొచ్చే ప్రమాదముంది. ఇక న్యూజిలాండ్‌ విషయానికొస్తే సుజీ బేట్స్‌ సారథ్యంలోని ఈ జట్టు మేటి ఆల్‌రౌండ్‌ టీమ్‌. శాటర్‌వైట్, రాచెల్‌ ప్రిస్ట్‌ ఈ టోర్నీలో ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు బౌలింగ్‌లోనూ టీనేజ్‌ స్పిన్నర్‌ అమిలియా కెర్, లె కాస్పెరెక్‌ల రూపంలో నాణ్యమైన బౌలర్లున్నారు.

జట్లు (అంచనా)
భారత్‌: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), పూనమ్‌ రౌత్, స్మృతి మంధన, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్, సుష్మ వర్మ, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, ఏక్తా బిష్త్, జులన్‌ గోస్వామి, పూనమ్‌ యాదవ్‌.

న్యూజిలాండ్‌: సుజీ బేట్స్‌ (కెప్టెన్‌), శాటర్‌వైట్, రాచెల్‌ ప్రిస్ట్, సోఫీ డివైన్, మ్యాడీ గ్రీన్, హడిల్‌స్టోన్, లె కాస్పెరెక్, అమిలియా కెర్, కేటీ మార్టిన్, కెటీ పెర్కిన్స్, లి తహుహు.

ప్రపంచ కప్‌ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్‌తో భారత్‌ 11 సార్లు తలపడింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోయి, కేవలం ఒక మ్యాచ్‌లోనే భారత్‌ గెలిచింది. మరో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 44 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 16 మ్యాచ్‌ల్లో... న్యూజిలాండ్‌ 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది.