భారత మహిళల కల చెదిరె...

3 Aug, 2018 01:40 IST|Sakshi

క్వార్టర్స్‌లో 3–1తో గెలిచిన ఐర్లాండ్‌ 

మహిళల హాకీ ప్రపంచకప్‌  

లండన్‌: ప్రపంచకప్‌లో భారత మహిళల ఆట క్వార్టర్‌ ఫైనల్‌కే పరిమితమైంది. సెమీస్‌ ఆశలతో బరిలోకి దిగిన మన జట్టు చివరకు షూటౌట్‌లో చేతులెత్తేసింది. గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో 1–3 గోల్స్‌ తేడాతో ఐర్లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్‌ తరఫున ఏకంగా ముగ్గురు క్రీడాకారిణులు వరుసగా విఫలమయ్యారు. లీగ్‌లో ఐర్లాండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం... అలాగే ప్రపంచకప్‌లో 44 ఏళ్ల సెమీస్‌ నిరీక్షణకు తెరదించాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు ఆవిరయ్యాయి. నాలుగు క్వార్టర్‌లలోనూ ప్రత్యర్థి జట్టుకు దీటుగా బదులిచ్చిన భారత అమ్మాయిలకు ‘పెనాల్టీ షూటౌట్‌’ శరాఘాతమైంది.

షూటౌట్‌లో ప్రత్యర్థి గోల్‌కీపర్‌ మెక్‌ఫెర్రాన్‌ను బోల్తా కొట్టించడంలో రాణి రాంపాల్, మోనిక, నవజ్యోత్‌ వరుసగా విఫలమయ్యారు. ఇదే సమయంలో నికొల డెలి, ఫ్లానగన్‌ అన్నా షాట్లను భారత గోల్‌ కీపర్‌ సవిత అడ్డుకుంది. అయితే తర్వాత రొయిసిన్‌ అప్టన్, అలిసన్‌ మికీ, క్లోయ్‌ వాట్కిన్స్‌ షాట్లు లక్ష్యాన్ని చేరడంతో భారత్‌ కథ ముగిసింది. భారత్‌ తరఫున రీనా మాత్రమే ఒక గోల్‌ చేయగలిగింది. అంతకుముందు ఇరు జట్ల క్రీడాకారిణులు  కదంతొక్కడంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ప్రతీ క్వార్టర్‌లోనూ పైచేయి సాధించేందుకు రెండు జట్ల ప్లేయర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో నాలుగు క్వార్టర్లు ముగిసినా ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. నిర్ణీత సమయానికి 0–0గా మ్యాచ్‌ ముగిసింది. దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.

>
మరిన్ని వార్తలు