వెలాసిటీ (vs) సూపర్‌ నోవాస్‌

11 May, 2019 00:39 IST|Sakshi

నేడు మహిళల టి20 చాలెంజ్‌ ఫైనల్‌

రాత్రి గం. 7.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

జైపూర్‌: ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినా, పురుషుల ఐపీఎల్‌ తరహాలో ఉత్కంఠగా సాగుతూ బాగానే ఆకట్టుకుంది మహిళల టి20 చాలెంజ్‌. ఫైనల్‌ సహా మొత్తం నాలుగు మ్యాచ్‌ల షెడ్యూల్‌తో... ట్రయ ల్‌ బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్‌ నోవాస్‌ పేరిట మూడు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్‌ దశలో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్‌ గెలిచాయి. రెండేసి పాయింట్లతో అన్నీ సమంగా నిలిచినా నెట్‌ రన్‌రేట్‌లో వెనుకబడి ట్రయల్‌ బ్లేజర్స్‌ ఫైనల్‌కు దూరమైంది.  హైదరాబాదీ వెటరన్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌ నేతృత్వంలోని వెలాసిటీ... హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం లోని సూపర్‌ నోవాస్‌ మధ్య శనివారం ఇక్కడ తుది పోరు జరుగనుంది. వాస్తవానికి డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఉన్న ట్రయల్‌ బ్లేజర్స్‌ కూడా బాగానే ఆడింది. స్మృతి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో నోవాస్‌పై నెగ్గింది. కానీ, వెలాసిటీపై రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యంతో కేవలం 112 పరుగులకే పరిమితమైంది. ఈ ప్రభావం రన్‌రేట్‌పై పడింది.

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి పాలవడం మైనస్‌గా మారింది. గురువారం వెలాసిటీపై గెలిచిన నోవాస్‌ ఫైనల్‌ బెర్తు కొట్టేసింది. ఈ రెండింటి కంటే చాలా మెరుగైన రన్‌ రేట్‌ ఉన్న వెలాసిటీకి ఓడినా టైటిల్‌ పోరుకు వెళ్లేందుకు ఇబ్బంది లేకపోయింది. అయితే, బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు కట్టిపడేస్తుండటంతో హర్మన్, జెమీమా రోడ్రిగ్స్, హేలీ వంటి హిట్టర్లున్నా మరీ స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. 150 దాటడమే గగనం అన్నట్లుంది. ఈ స్కోర్లను ఛేదించేందుకూ కష్టపడాల్సి వస్తుండటంతో ఉత్కంఠకు లోటుండటం లేదు. శనివారం నాటి తుది సమరంలోనూ భారీ స్కోర్లను ఆశించలేం. టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ (వెలాసిటీ) ఎలా ఆడుతుం దనేది ఆసక్తికరం. దూకుడు పరంగా చూస్తే రోడ్రిగ్స్, హర్మన్‌లకు తోడు సోఫియా డివైన్‌ వంటి బ్యాటర్లు ఉండటం నోవాస్‌కు మేలు చేయనుంది. అనుభవం ప్రకారం అయితే మిథాలీ, వేదా కృష్ణమూర్తి, హేలీలతో వెలాసిటీ దీటుగా కనిపిస్తోంది. గురువారం లీగ్‌ మ్యాచ్‌లో ఇదే జట్టుపై సాధించిన గెలుపు నోవాస్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చేదే.  

మరిన్ని వార్తలు