90 లక్షలు!

3 Apr, 2020 06:19 IST|Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ వీక్షకుల సంఖ్య  

దుబాయ్‌: ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన టైటిల్‌పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం మార్చి 8న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను భారత్‌లో ఏకంగా 90.2 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించింది.

ఎంసీజీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా... భారత్ లో ఈ మ్యాచ్‌ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు వారి లెక్కల్లో తేలింది. ఈ టోర్నీ మొత్తాన్ని చూసేందుకు భారత అభిమానులు 540 కోట్ల నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు తెలిపింది. దీన్ని ఒక్కో అభిమాని... ఒక్కో మ్యాచ్‌ను వీక్షించిన సమయం ఆధారంగా లెక్కించినట్లు ఐసీసీ పేర్కొంది. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్‌ తర్వాత డిజిటల్‌ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. మహిళల క్రికెట్‌కు సంబంధించి ఇదే మొదటిది కావడం విశేషం. ఈ మాధ్యమం ద్వారా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య ఈ టోర్నీకి సంబంధించిన 110 కోట్ల వీడియోలు అభిమానులు చూశారు. 

ఐఎస్‌ఎల్‌కు పెరిగిన వీక్షకులు
న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) తన వీక్షకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. తాజా ఐఎస్‌ఎల్‌ (2019–20) సీజన్‌ను వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను గత సీజన్‌తో పోలిస్తే 51 శాతం పెంచుకుందని టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 16.8 కోట్ల మంది తాజా సీజన్‌ను వీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రసారకర్తగా ఉన్న స్టార్‌ స్పోర్ట్స్, స్టార్‌ ఇండియా ఈ సీజన్‌ను 11 చానళ్ల ద్వారా 7 భాషల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది. దీంతో పాటు హాట్‌స్టార్, జియో టీవీ డిజిటల్‌ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అట్లెటికో డి కోల్‌కతా రికార్డు స్థాయిలో మూడోసారి ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో  చెన్నైయిన్‌ ఎఫ్‌సీను కోల్‌కతా ఓడించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా