ప్రపంచకప్‌ ఓటమి: షఫాలీ కంటతడి

8 Mar, 2020 18:13 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. అంతకుమించిన  ఆకాంక్షల మధ్య టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్‌ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్‌ సేన.. ఫైనల్‌ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్‌ దశలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్‌ పోరులో అట్టర్‌ ఫ్లాఫ్‌ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్‌ దశలో బ్యాటింగ్‌ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. 

ఆస్ట్రేలియా భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ షఫాలీ రూపంలో అందరిలోనూ ఓ ధైర్యం ఏర్పడింది. అభిమానులతో పాటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సైతం పవర్‌ ప్లే ముగిసే వరకైన హరియాణ క్రికెటర్‌ క్రీజులో ఉండాలని కోరుకుంది. కానీ తొలి ఓవర్‌లోనే ఊహించని విధంగా అవుటై తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. షఫాలీ అవుటవ్వడంతోనే టీమిండియా ఓటమికి పునాది రాయి పడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక అవుటైన తీరు పట్ల ఈ యువ క్రికెటర్‌ తీవ్ర అసహనానికి గురై భారంగా క్రీజుల వదిలి వెళ్లింది. 

ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. ప్రస్తుతం షఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెకు బాసటగా నిలిచారు. ‘కేవలం పదహారేళ్ల వయసులోనే ప్రపంచ శ్రేణి బౌలర్లను గడగడలాడించావు. నీ ప్రతిభకు అనుభవం తోడైతే టీమిండియాకు మరెన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తావు. టైటిల్‌ గెలవకున్నా మా హృదయాలను గెలుచుకున్నారు’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 
 

చదవండి:
ఈసారి కూడా చాంపియన్‌ ఆస్ట్రేలియానే
షఫాలీ వర్మ అరుదైన ఘనత

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు