జట్టు స్కోరు 95... మిథాలీ 57!

27 Mar, 2014 00:57 IST|Sakshi
జట్టు స్కోరు 95... మిథాలీ 57!

ఇంగ్లండ్ చేతిలో భారత మహిళలు చిత్తు   
 సెమీస్ అవకాశాలు గల్లంతు!
 
 సిల్హెట్: మహిళల టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగింది. బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మిథాలీ బృందం పరాజయం పాలైంది. బుధవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగా...ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన టీమిండియా ఇక మిగిలిన రెండు లీగ్‌లు (వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో) నెగ్గినా సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమే!
 
 హైదరాబాదీ ఒంటరి పోరు...
 టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.  జట్టు సభ్యులలో  కెప్టెన్ మిథాలీ రాజ్ (56 బంతుల్లో 57; 8 ఫోర్లు) మాత్రమే అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆరంభంనుంచి దూకుడుగా ఆడిన ఆమె బ్యాట్‌నుంచే ఇన్నింగ్స్‌లో 60 శాతం పరుగులు రావడం విశేషం. ఇతర బ్యాట్స్‌విమెన్‌లో స్రవంతి నాయుడు (27 బంతుల్లో 11) మినహా మిగతా 9 మంది ఒక అంకెకే పరిమితయ్యారు.
 
 ఏ ఒక్కరూ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో  అన్య శ్రుబ్‌సోల్ (3/6) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగా, జెన్నీ గన్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం సారా టేలర్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు), గ్రీన్ వే (41 బంతుల్లో 26; 1 ఫోర్) రాణించడంతో ఇంగ్లండ్ విజయం సులువైంది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కొద్దిగా తడబడినా చిన్న స్కోరు కావడంతో ఇబ్బంది లేకుండా 11 బంతుల ముందే ముగించింది. భారత బౌలర్ సోనియా దబీర్ 2 వికెట్లు పడగొట్టింది.
 
 పురుషుల టి20 ప్రపంచకప్‌లో నేడు
 దక్షిణాఫ్రికా   x నెదర్లాండ్స్
 మధ్యాహ్నం గం. 3.00 నుంచి
 
 ఇంగ్లండ్ x శ్రీలంక
 రాత్రి గం. 7.00 నుంచి
 
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 

మరిన్ని వార్తలు