‘ఐపీఎల్‌ కోసం షెడ్యూల్‌ మార్చితే సహించం’

24 Apr, 2020 13:09 IST|Sakshi

కరాచీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) పట్ల పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)మరోసారి విషం వెళ్లగక్కింది.  కరోనా వైరస్‌ కారణంగా అసలు ఈఏడాది క్రికెట్‌ టోర్నీలు జరగడం సందేహాస్పదంగా మారిన తరుణంలో ఆసియా కప్‌ షెడ్యూల్‌ను భారత్‌ మార్చడానికి యత్నిస్తుందంటూ కొత్త పల్లవి అందుకుంది. ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌నే భారత మార్చేస్తుందంటూ పీసీబీ ఆరోపిస్తోంది. ఒకవేళ ఐపీఎల్‌-13 వ సీజన్‌ కోసం ఆసియా కప్‌ షెడ్యూల్‌ను మార్చితే తాము అంగీకరించమని ముందుగానే సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ‘ మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. ఆసియా కప్‌కు సెప్టెంబర్‌లో షెడ్యూల్‌ చేయబడి ఉంది. ఇది పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడ వరకూ ఓకే.. కానీ మొత్తం ఆసియా కప్‌ షెడ్యూల్‌నే మార్చాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌ను మార్చాలనే చర్చలు ఆరంభం అయినట్లు మాకు సమాచారం ఉంది. (నేరుగా ధోని వద్దకు పో..!)

దీన్ని మేము సహించం. ఆసియాకప్‌ను నవంబర్‌-డిసెంబర్‌లో జరపడానికి ప‍్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అలా అయితే అది మాకు సాధ్యం కాదు. కేవలం ఆసియాకప్‌ సభ్యత్వ దేశాల్లో ఉన్న ఒక దేశం కోసం దాని షెడ్యూల్‌ను మార్చిస్తే అది చాలా దారుణం. దానికి మాకు సహకారం అస్సలు ఉండదు’ అని పీసీబీ సీఈఓ వసీం ఖాన్‌ తెలిపారు. అయితే ఐపీఎల్‌ను ఏ ప్రధాన  సిరీస్‌లు మిస్‌ కాకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అక్టోబర్‌ విండోను అనుకుంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌ అనేది అక్టోబర్‌ 6వ తేదీతో ముగుస్తుంది.దీని తర్వాతే ఐపీఎల్‌ను ప్లాన్‌ చేయాలని అనుకుంటున్నారు. అన్ని సవ్యంగా సాగితే ఇదే సరైనది బీసీసీఐ భావిస్తోంది. కాకపోతే ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌ షెడ్యూల్‌ను మార్చాలనే చర్చలు ఇప్పటివరకూ జరగలేదు. మరి పీసీబీ ముందర కాళ్లకు బంధం వేయడానికి కొత్త రాగం అందుకుని ఉండవచ్చు. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-13వ సీజన్‌ ఇప్పటికే ఆరంభం కావాల్సి ఉండగా దానికి లాంగ్‌ బ్రేక్‌ పడింది. ఈ పరిణామానికి అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంఛైజీలు వేల కోట్ల రూపాయిలు నష్టపోతున్నాయి. అయితే కరోనా వైరస్‌ ప‍్రభావం తగ్గితే ఐపీఎల్‌ను జరిపించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.(ఓడిపోతే సరదా ఏమిటి..?; భార్యకు స్మిత్‌ రిప్లై)

>
మరిన్ని వార్తలు