‘వారి చేతిలో ఓడిపోతే ప్రపంచమేమీ ఆగిపోదు’

18 Aug, 2019 11:01 IST|Sakshi

కేప్‌టౌన్‌: త్వరలో టీమిండియాతో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో తాము ఓడిపోయినంత మాత్రాన ప్రపంచమేమీ ఆగిపోదని దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ ఎనోచ్‌ పేర్కొన్నాడు. భారత్‌కు గట్టిపోటీ ఇవ్వడంపైనే తమ ప్రధాన లక్ష్యమని అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కొత్తగా ఎంపికైన ఎనోచ్‌ అన్నారు. ఉపఖండంలో దక్షిణాఫ్రికాకు మంచి రికార్డు లేకపోవడం, అందులోనూ భారత్‌లో టీమిండియా చేతిలో పేలవమైన రికార్డు ఉండటంపై ఎనోచ్‌ స్పందించారు. ‘ భారత్‌లో భారత్‌ చేతిలో ఓడిపోతే ప్రపంచం ఆగిపోదు కదా. మా శక్తి మేరకు కృషి చేస్తాం. ఇది మాకు అతి పెద్ద చాలెంజ్‌. నాకు కూడా మంచి అవకాశం. కాకపోతే ఈ కొద్దిపాటి సమయంలో మేము ఎంతవరకూ సక్సెస్‌ అవుతామనేది నాకు తెలియదు’ అని ఎనోచ్‌ అన్నారు.

 దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎనోచ్‌ను కొత్తగా నియమించింది. ఆయన జట్టుకు కోచ్‌, సెలక్టర్‌, టీమ్‌ మేనేజర్‌గా వ్యవరిస్తాడు. సహాయ సిబ్బంది మొత్తం ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తారు. ఫుట్‌బాల్‌ లీగ్‌ల్లో మేనేజర్ల పదవి స్ఫూర్తిగా తీసుకొని సఫారీ బోర్డు ఆయన్ను నియమించింది. సఫారీ జట్టు సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్‌ 15న ధర్మశాలలో తొలి టెస్టు ఆరంభం కానుంది. అనంతరం మూడు టీ20  సిరీస్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు