భారత్‌ ఆశాకిరణం నీరజ్‌

4 Aug, 2017 00:13 IST|Sakshi
భారత్‌ ఆశాకిరణం నీరజ్‌

నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

లండన్‌: అంతర్జాతీయస్థాయిలో మరో క్రీడా పండగకు రంగం సిద్ధమైంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈనెల 13 వరకు జరిగే ఈ పోటీలకు ఒలింపిక్‌ స్టేడియం వేదికగా నిలువనుంది. భారత్‌ తరఫున 25 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 34 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో భారత్‌కు ఒక్కటంటే ఒక్కటే పతకం వచ్చింది. అదీ కాంస్యమే. 2003 పారిస్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్‌ విభాగంలో అంజూ బాబీ జార్జ్‌ మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఏకైక కాంస్య పతకాన్ని అందించింది. ఆ తర్వాత పలుమార్లు భారత అథ్లెట్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చారు.

పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రాపై భారత్‌కు ఆశలున్నాయి. గతేడాది ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ 86.48 మీటర్లతో ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ నీరజ్‌ పసిడి పతకాన్ని సాధించాడు. దాంతో నీరజ్‌ చోప్రాపై అంచనాలు పెరిగాయి. పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో ఆగస్టు 10న క్వాలిఫయింగ్‌... 12న ఫైనల్‌ జరుగుతాయి. మొత్తం 33 మంది బరిలో ఉండగా... 12 మంది ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

ప్రపంచం దృష్టి బోల్ట్‌పైనే..
లండన్‌లోని ఒలింపిక్‌ స్టేడియంలో శుక్రవారం మొదలయ్యే ఈ పోటీల్లోనే బోల్ట్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈసారి బోల్ట్‌ రెండు ఈవెంట్స్‌లలో (100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలే) బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 5న 100 మీటర్ల ఫైనల్‌... ఆగస్టు 12న 4్ఠ100 మీటర్ల రిలే ఫైనల్‌ జరగనున్నాయి. రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించి కెరీర్‌కు అద్భుతమైన ముగింపు ఇవ్వాలని బోల్ట్‌ పట్టుదలతో ఉన్నాడు.

మరిన్ని వార్తలు