వివాదంలో వరల్డ్‌ చాంపియన్‌

18 Jun, 2020 03:47 IST|Sakshi

కోల్‌మన్‌పై తాత్కాలిక నిషేధం  

న్యూయార్క్‌: ప్రపంచ 100 మీ. స్ప్రింట్‌ చాంపియన్, అమెరికన్‌ స్టార్‌ క్రిస్టియాన్‌ కోల్‌మన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. డోపింగ్‌ టెస్టుకు పిలిచినపుడు అందుబాటులోకి రాకపోవడంతో అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయంపై తుది విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి పోటీల్లో పాల్గొనరాదని ఆదేశించింది. గత ఏడాదే అతను ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను పాటించకపోవడంతో చర్య తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కావడంతో ఏఐయూ కాస్త వెనుకంజ వేసింది.

అయితే గడిచిన 12 నెలల కాలంలో మూడుసార్లు టెస్టులకు ప్రయత్నించినా...తాను ఎక్కడున్నాడనే సమాచారాన్ని కోల్‌మన్‌ ఇవ్వకపోవడంతో తాజాగా చర్యలు తీసుకున్నారు. దీనిపై కోల్‌మన్‌ స్పందిçస్తూ గత డిసెంబర్‌ 9న ఏఐయూ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినప్పటికీ తను క్రిస్‌మస్‌ షాపింగ్‌లో బిజీగా ఉండటం వల్లే కాల్‌కు స్పందించలేకపోయానని ట్వీట్‌ చేశాడు. ఈ ఒక్క ఫోన్‌ కాల్‌కే తనను సస్పెండ్‌ చేయడం విడ్డూరమని అన్నాడు. దీనిపై ఏఐయూ మాట్లాడుతూ పలుమార్లు ప్రయత్నించినా టెస్టులు చేసుకునేందుకు అతను అందుబాటులో లేకపోవడంతోనే ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపింది.

మరిన్ని వార్తలు