హమ్మయ్య.. సమ్మె ఆగింది!

13 Jun, 2014 02:15 IST|Sakshi
హమ్మయ్య.. సమ్మె ఆగింది!

సావో పాలో: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వాహకులు ఇప్పుడు ఇలాగే ఫీలవుతున్నారు. ప్రారంభ వేడుకలతో పాటు ఆరంభ మ్యాచ్ కూడా జరిగే ప్రధాన స్టేడియానికి రవాణా సదుపాయం కలిగించే సావో పాలో సబ్‌వే కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో అభిమానులను అక్కడికి ఎలా చేర్చాలనే దానిపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. అయితే తమ సమ్మె కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో.. ఏమో కానీ బుధవారం రాత్రి నుంచి తమ ఆందోళనను విరమించుకున్నారు.
 
 జీతాల పెంపు కోరుతూ చేస్తున్న ఈ సమ్మె పట్ల 15 వందల మంది సబ్‌వే కార్మికులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సరైందని నమ్ముతున్నట్టు యూనియన్ అధ్యక్షుడు అల్టినో ప్రెజర్స్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా తాము సమ్మెకు దూరం కాలేదని.. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా తిరిగి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
 
 రియో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సమ్మె
 రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభమైన గురువారం నుంచి ఒక రోజు పాటు రియో విమానాశ్రయ సిబ్బంది పాక్షిక సమ్మెకు దిగారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 70 శాతం మంది విధుల్లో ఉండగా మిగిలిన వారు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రపంచకప్ బోనస్, మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, 12 శాతం జీతాల పెంపును వీరు డిమాండ్ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు