‘మధ్య’లోనే గెలిచారు

16 Feb, 2015 00:53 IST|Sakshi
‘మధ్య’లోనే గెలిచారు

ఈ మ్యాచ్‌లో ఫలితాన్ని మార్చింది మధ్య ఓవర్లు భారత జట్టు 11 నుంచి 35 ఓవర్ల మధ్య 150 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. అదే సమయంలో పాక్ జట్టు 11 నుంచి 35 ఓవర్ల మధ్య 6 ప్రధాన వికెట్లు కోల్పోయింది. వన్డేల్లో రెండు కొత్త బంతులు, రెండు కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత మధ్య ఓవర్లలో బాగా ఆడటమే కీలకం అని ధోని పదే పదే చెబుతున్నాడు. ఈ మ్యాచ్‌లో దీనిని చక్కగా ఆచరణలో పెట్టిన భారత్ ఏ మాత్రం తడబాటు లేకుండా ప్రపంచకప్‌ను ఘనంగా ప్రారంభించింది.
 
 సాక్షి క్రీడావిభాగం
 ధోని టాస్ గెలవగానే భారత్ 20 శాతం మ్యాచ్ గెలిచింది. ఇంత ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో లక్ష్యఛేదన చాలా కష్టం. పిచ్ రెండు ఇన్నింగ్స్‌కూ ఒకేలా ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ చేసి ఎంతో కొంత లక్ష్యాన్ని నిర్దేశించడం ఉత్తమం. భారత్ కూడా ఇదే పని చేసింది. ఈ మ్యాచ్ కోసం భారత్ బాగా సన్నద్ధమైంది. ఇర్ఫాన్ బంతులను ఎదుర్కోవడం కోసం నెట్స్‌లో స్టూల్స్ మీద బౌలర్లను నిలబెట్టి బంతులు వేయించి ప్రాక్టీస్ చేశారు.
 
 తొలి పది ఓవర్లు పరుగులు రాకపోయినా ఫర్వాలేదు, వికెట్ కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత ఓపెనర్లు ఆడారు. 8వ ఓవర్లో రోహిత్ అవుటయ్యే వరకు కూడా ఓపెనర్లు కచ్చితత్వంతో బ్యాటింగ్ చేశారు. ఇక ధావన్, కోహ్లి జత కలిశాక మ్యాచ్‌పై భారత్‌కు పట్టు వచ్చేసింది. కోహ్లి ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేసి పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఏ మాత్రం ఫామ్‌లో లేని ఇద్దరు ఆటగాళ్లు 5.77 రన్‌రేట్‌తో 129 పరుగులు జోడించడం గొప్ప విషయం.
 
 మిడిల్ ఓవర్లలో ‘మజా’: భారత ఇన్నింగ్స్‌లో రైనా క్రీజులోకి వచ్చే వరకు పెద్దగా మెరుపులు లేవు. ధావన్ కొట్టిన ఒక్క సిక్సర్ మినహా స్టేడియాన్ని హోరెత్తించే షాట్లు లేవు. కానీ భారత జట్టు తెలియకుండా పరుగులు రాబట్టుకుంది మిడిల్ ఓవర్లలోనే. 6 రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. ముఖ్యంగా పాక్ స్పిన్నర్లు ఆఫ్రిది, యాసిర్ షాలను భారత జోడి ధావన్, కోహ్లి ఆడుకున్నారు. సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును చకచకా ముందుకు నడిపించారు. అయితే దురదృష్టవశాత్తు ధావన్ రనౌట్ అయ్యాడు. అప్పటికి 30 ఓవర్లు అయిపోయాయి. ఈ దశలో సాధారణంగా రహానే బ్యాటింగ్‌కు రావాలి. కానీ పాక్ జట్టులో ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు, ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నందున... ఓ ఎడమచేతి వాటం ఆటగాడు క్రీజులో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రైనాను ప్రమోట్ చేశారు. రైనా కూడా రాగానే హడావుడి ఏం చేయలేదు. క్రీజులో నిలదొక్కుకునే వరకు సింగిల్స్ తీశాడు. ఒక్కసారి కుదురుకున్నాక... పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా మిడ్ వికెట్‌లోకి కొట్టిన సిక్సర్లు హైలైట్.
 స్లాగ్‌లో చకచకా...: కోహ్లి ఈసారి తన శైలికి భిన్నంగా ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి రావాలనే తపన దీనికి ఓ కారణమైతే... స్లాగ్ ఓవర్ల కోసం వికెట్లు కాపాడాలనే వ్యూహం రెండో కారణం.
 
 కోహ్లి సెంచరీ, రైనా అర్ధసెంచరీ స్వల్ప వ్యవధిలో పూర్తయ్యాయి. ఇక ఒక్కసారిగా భారత ఇన్నింగ్స్‌లో వేగం పెంచారు. ముఖ్యంగా రైనా వరుస బౌండరీలతో హోరెత్తించాడు. దీంతో 41 నుంచి 45 వరకు ఐదు ఓవర్లలోనే 56 పరుగులు వచ్చాయి. ఈ దశలో భారత్ 330 వరకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లు వేసిన సొహైల్ ఖాన్ నాలుగు కీలక వికెట్లతో భారత పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. అయితే 300 మార్కును చేరుకుని మానసికంగా భారత్ పటిష్ట స్థితికి చేరింది. భారత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ధోని సేన మ్యాచ్‌ను దాదాపు 60 శాతం గెలిచింది.
 
 సమష్టిగా... చక్కగా...: ప్రాక్టీస్ మ్యాచ్‌లకు భిన్నంగా ధోని తన ప్రధాన పేసర్లు ఉమేశ్, షమీలకు కొత్త బంతులు ఇచ్చేశాడు. అటు పాకిస్తాన్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు కావాలనే వ్యూహంతో... ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకుని సీనియర్ యూనిస్ ఖాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. యూనిస్ బలహీనతను షమీ చక్కగా వర్కవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. 301 పరుగు లక్ష్యాన్ని ఛేదించే జట్టు 4వ ఓవర్లోనే వికెట్ కోల్పోతే ఇక కోలుకోవడం కష్టం. షహజాద్, హరీస్‌సోహైల్ ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేసినా... భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు తేలిపోయారు. ఉమేశ్ అద్భుత స్పెల్‌తో ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన పాక్ ఇక కోలుకోలేకపోయింది.
 
  మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించి స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఆకట్టుకున్నారు. మొత్తం మీద భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఆడిన భార త్ బృందం పాక్ జట్టు కంటే చాలా బలంగా ఉంది. మరోవైపు పాక్ క్రికెటర్లలో ఎక్కడా గెలవాలనే తపన గానీ, గతంలో భారత్‌తో ఆడిన జట్లలో ఉన్న కసి కనిపించలేదు.  ధోనిసేన ఇక్కడితో సంతృప్తి పడకూడదు. ప్రపంచకప్ అనే మహా యజ్ఞంలో ఒక్క క్రతువు మాత్రమే ముగిసింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మార్చి 29 వరకూ ఇలాగే చెలరేగాలి.
 
 నేటి మ్యాచ్ (సోమవారం)
 వెస్టిండీస్  xఐర్లాండ్
 గ్రూప్ బి; వేదిక: నెల్సన్
 తె.జా. గం. 3.30 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్-1లో
 ప్రత్యక్ష ప్రసారం

 

మరిన్ని వార్తలు