రష్యా గర్జన

15 Jun, 2018 04:01 IST|Sakshi
తొలిగోల్‌ కొడుతున్న గాజిన్‌స్కీ

తొలిమ్యాచ్‌లో అద్భుత విజయం

5–0తో సౌదీ అరేబియా చిత్తు

సొంతగడ్డపై రష్యా జూలు విదిల్చింది. గోల్స్‌ వర్షం కురిపించి ఘనంగా బోణీ కొట్టింది. ఆకలిగొన్న పులిలా విరుచుకుపడి సౌదీ అరేబియాకు పాంచ్‌ పటాకాతో పంచ్‌ ఇచ్చింది. ఫిఫా ప్రపంచ కప్‌నకు ఆతిథ్య జట్టుగా తనవంతు అదిరే ఆరంభం అందించింది.   

మాస్కో: ఆ టోర్నీ, ఈ టోర్నీ అని లేకుండా గెలుపు కోసం నెలల తరబడి సాగుతున్న రష్యా నిరీక్షణ... ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌తోనే తీరింది. ఇక్కడి లుజ్నికి స్టేడియంలో గురువారం సౌదీ అరేబియాతో జరిగిన పోరులో అద్భుత రీతిలో ఆడిన ఆతిథ్య జట్టు 5–0 తేడాతో జయభేరి మోగించింది. బంతిని ఎక్కువ సమయం ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ సౌదీ జట్టు ఒక్క గోల్‌ కూడా చేయలేక పోయింది. రష్యా ఆటగాళ్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ చెరిషెవ్‌ రెండు, గాజిన్‌ స్కీ, అలెగ్జాండర్‌ గొలొవిన్, డియుబా తలా ఒక గోల్‌తో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేశారు. చెరిషెవ్, డియుబాలు సబ్‌స్టిట్యూట్‌లుగా వచ్చి గోల్స్‌ కొట్టడం విశేషం.

అదే ‘తల’మానికం
ఆతిథ్య దేశాన్ని ఒత్తిడిలో నెడుతూ మ్యాచ్‌ను సౌదీనే దూకుడుగా ప్రారంభించింది. క్రమంగా రెండు జట్లూ ఎదురుదాడి వ్యూహానికి దిగాయి. ఓ దశలో గొలొవిన్, ఫెర్నాండెజ్‌ దూసుకొచ్చినా సౌదీ డిఫెండర్లు చక్కగా అడ్డుకున్నారు. ప్రత్యర్థిపై అదే పనిగా ఒత్తిడి పెంచిన రష్యాకు 12వ నిమిషంలో ఫలితం దక్కింది. గొలొవిన్‌ అందించిన క్రాస్‌ను గాజిన్‌స్కీ తలతో ముచ్చటైన రీతిలో గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో సౌదీ ఆత్మరక్షణలో పడిపోయింది. కీలక ఆటగాడైన అలెన్‌ డగోవ్‌ కండరాల గాయంతో వైదొలగడం కూడా రష్యాకు కలిసొచ్చింది. అతడి స్థానంలో వచ్చిన చెరిషెవ్‌ 43వ నిమిషంలో గోల్‌ కొట్టాడు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి జట్టు 2–0తో నిలిచింది.

రెండో భాగంలో మరింత జోరుగా
వరుసగా గోల్స్‌ సమర్పించుకుని మానసికంగా వెనుకడుగు వేసిన సౌదీ... రెండో భాగంలో ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. కనీసం గోల్‌పోస్ట్‌ సమీపానికి కూడా వెళ్లలేకపోయింది. అటు రష్యా సైతం పట్టు విడవ కుండా మరింత జోరుగా ఆడింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డియుబా 71వ నిమిషంలో గోల్‌తో ఆధిక్యాన్ని పెంచాడు. 91వ నిమిషంలో చెరిషేవ్‌ మరో గోల్‌ చేశాడు. 94వ నిమిషంలో గొలోవిన్‌ ఫ్రీ కిక్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపడం, ఫైనల్‌ విజిల్‌ మోగడం వెంటవెంటనే జరిగిపోయాయి. డిఫెన్స్‌ లోపాలతో సౌదీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వారి గోల్‌ పోస్ట్‌పైకి 13 సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లు దాడి చేయడమే దీనికి నిదర్శనం. రిఫరీలు ఇరు జట్లలో చెరో ఆటగాడు ఎల్లో కార్డ్‌ చూపారు.

                                             చెరిషెవ్‌

మరిన్ని వార్తలు