ఆమ్లా అందుకోలేకపోయాడు.. కోహ్లి రికార్డు సేఫ్‌

19 Jun, 2019 18:45 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ ఆరంభం నుంచి ఎంతగానో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌, సీనియర్‌ ఆటగాడు హషీమ్‌ ఆమ్లాను ఊరిస్తున్న రికార్డును ఎట్టకేలకు సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా 24 పరుగులు చేయడంతో వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి 175 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకోగా, ఆమ్లా 176 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక అత్యంత వేగంగా 8000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

గతంలో సఫారి జట్టు విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 182 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా 8000 పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో జాక్వస్‌ కలిస్‌(11,579), డివిలియర్స్‌(9577), గిబ్స్‌(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమ్లా ఫామ్‌లో లేకపోవడంతో ఈ రికార్డు కాస్త ఆలస్యం అయింది. 36 ఏళ్ల ఆమ్లాకి ఇదే ఆఖరి ప్రపంచకప్‌గా అందరూ భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు