పోరాడి ఓడిన బంగ్లా

20 Jun, 2019 23:45 IST|Sakshi

భారీ లక్ష్యానికి తడబడని బంగ్లా

48 పరుగుల తేడాతో ఓటమి

రహీమ్‌ శతకం వృథా

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆసీస్‌ ఆగ్రస్థానం

నాటింగ్‌హామ్‌: సంచలనాల బంగ్లాదేశ్‌ మరోసారి తన పోరాటపటిమతో ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌, అన్ని రంగాల్లో తనకంటే బలమైన ఆస్ట్రేలియాపై గెలిచేంత పనిచేసింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్‌ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్‌ రహీమ్‌(102 నాటౌట్‌; 97 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్‌) అసాధరణ రీతిలో సెంచరీతో పోరాడగా.. తమీమ్‌(62), మహ్మదుల్లా(69)లు అర్దసెంచరీలు సాధించారు. సీనియర్‌ ఆటగాడు షకీబ్‌(41), లిట్టన్‌ దాస్‌(20) భారీ స్కోర్‌ చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కౌల్టర్‌నైల్‌, స్టొయినిస్‌, స్టార్క్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా ఒక్క వికెట్‌ దక్కించుకున్నారు. బంగ్లాపై వీరవిహారం చేసి భారీ శతకం సాధించిన డేవిడ్‌ వార్నర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

గెలుస్తుందా అనిపించేలా..
ఆసీస్‌ లాంటి బలమైన జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో కనీసం పోరాటం చేయకుండానే బంగ్లా చాపచుట్టేస్తుందనుకున్నారు. అయితే గత బంగ్లా జట్టు కాదని నిరూపిస్తూ ఓటమిని అంత త్వరగా ఒప్పుకోలేదు. ఓ దశలో బంగ్లా పోరాటంతో ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ఓడిపోతామనే అనుమానం కలిగింది. అయితే కొంచెం స్కోర్‌ తక్కువైనా ఆసీస్‌ ఓడిపోయేదే అని సగటు అభిమాని భావించాడు. ముఖ్యంగా రహీమ్‌ చివరి వరకు ఉండి విజయం కోసం పోరాడాడు. మహ్మదుల్లా కూడా చివర్లో బ్యాట్‌ ఝులిపించడంతో లక్ష్యానికి దగ్గరికి వచ్చింది. అయితే భారీ స్కోర్‌ కావడం, చివర్లో వికెట్లు పడటంతో బంగ్లా ఓటమి ఖాయం అయింది. 

అంతకుముందు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (166: 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు సారథి ఆరోన్‌ ఫించ్‌(53: 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వన్‌డౌన్‌లో ఉస్మాన్‌ ఖవాజా (89: 72 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381పరుగులు చేసింది చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో సౌమ్య సర్కార్‌ మూడు, ముస్తాఫిజుర్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు.

అదిరే ఆరంభం...
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి నాలుగు ఓవర్లు కొంచెం ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో ఓవర్‌ నుంచి గేర్‌ మార్చింది. మోర్తాజా వేసిన ఈ ఓవర్‌ తొలి బంతినే సిక్సర్‌ మలచి ఫించ్‌ తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే, ఇదే ఓవర్‌ చివరి బంతికి వార్నర్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడిచ్చిన క్యాచ్‌ను పాయింట్‌లో షబ్బీర్‌ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వార్నర్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. చకచకా బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ 55 బంతుల్లో అర్ధసెంచరీ మార్కు చేరుకున్నాడు. కాసేపటికే ఫించ్‌ సైతం అర్ధశతకం పూర్తిచేసుకొని ఆ వెంటనే వెనుదిరిగాడు. దీంతో 121 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

అనంతరం ఉస్మాన్‌ ఖవాజాతో కలసి మరో భారీ భాగస్వామ్యాన్ని(160) నెలకొల్పిన వార్నర్‌ టోర్నీలో రెండో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో చకచకా 150 దాటిన అతన్ని సౌమ్య సర్కార్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అతని తర్వాత వచ్చిన మాక్స్‌వెల్‌ 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, ఆఖరి నాలుగు ఓవర్లలో పుంజుకున్న బంగ్లా బౌలర్లు ఖవాజా, స్టీవ్‌స్మిత్‌లను వెంట వెంటనే పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ స్కోరు కొంత తగ్గింది. 

>
మరిన్ని వార్తలు