ఇంగ్లండ్‌ చిత్తుచిత్తుగా..

25 Jun, 2019 22:53 IST|Sakshi

లండన్‌: సమఉజ్జీల పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియానే పై చేయి సాధించింది. శ్రీలంక, పాకిస్తాన్‌లపై అనూహ్య పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్‌.. మంగళవారం లార్డ్స్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుచిత్తుగా ఓడింది. ఆసీస్‌ బౌలర్లు బెహ్రాన్‌డార్ఫ్‌(5/44), మిచెల్‌ స్టార్క్‌(4/43) ధాటికి ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. ఆసీస్‌ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 221 పరుగులకే కుప్పకూలింది. దీంతో 64 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమి చవిచూసింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో బెన్‌ స్టోక్స్‌(89; 115 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. సెంచరీతో ఆసీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆరోన్‌ ఫించ్‌కు ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మరోసారి బాధ్యాతయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. సారథి ఆరోన్‌ ఫించ్‌ (100;116 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. డేవిడ్‌ వార్నర్‌(53; 61 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు.  టాపార్డర్‌ జోరును చూసి ఆసీస్‌ 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించారు. అయితే మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ మరోసారి విఫలమవడంతో 300కిపైగా పరుగులు సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ రెండు వికెట్లతో రాణించగా.. ఆర్చర్‌, వుడ్‌, స్టోక్స్‌, మొయిన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. 

మరిన్ని వార్తలు