ప్రపంచకప్‌: పాక్‌ చేజేతులా..

12 Jun, 2019 22:43 IST|Sakshi

41 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో ఓటమి

వార్నర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

టాంటన్‌ : టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పుంజుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా నేడు స్థానిక మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయ ఢంకా మోగించింది. ఆసీస్‌ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటై ఓటమి చచిచూసింది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(53) అర్దసెంచరీతో రాణించగా.. హఫీజ్‌(46), సారథి సర్ఫరాజ్‌(40)లు ఫర్వాలేదనిపించారు. అయితే కీలక సమయాలలో వికెట్లు కోల్పోవడం పాక్‌ కొంప ముంచింది. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. స్టార్క్‌, రిచర్డ్‌సన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. శతకంతో రాణించిన డేవిడ్‌ వార్నర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

ఆసీస్‌ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఫఖర్‌ జామన్‌ పరుగులేమి చేయకుండానే కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్‌ మరో ఓపెనర్‌ ఇమాముల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మంచి ఊపు మీదున్న బాబర్‌(30)ను కౌల్టర్‌ నైల్‌ ఔట్‌ చేస్తాడు. ఈ సమయంలో హఫీజ్‌తో కలిసి ఇమాముల్‌ ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడు. దీంతో రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి పట్టిష్ట స్థితిలో ఉంది. ఈ తరుణంలో విజయం పాక్‌ వైపే ఉంది. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో ఇమాముల్‌(53), హఫీజ్‌(46), మాలిక్‌(0), అసిఫ్‌ అలీ(5)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో పాక్‌ పీకల్లోతూ కష్టాల్లో పడింది.

వరెవ్వా వాహబ్‌..
ఇక ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో సర్ఫరాజ్‌తో కలిసి బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ విజయం కోసం పోరాడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం వాహబ్‌(45)ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో పాక్‌ ఓటమి ఖరారైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమిర్‌(0)ను స్టార్క్‌ బోల్తా కొట్టించాడు. ఇక మ్యాక్స్‌వెల్‌ సూపర్‌ త్రోతో సర్పరాజ్‌ను రనౌట్‌ చేయడంతో ఆసీస్‌ విజయం సంపూర్ణమైంది. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఆటగాళ్లలో వార్నర్‌(107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం సాధించగా.. ఫించ్‌(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు రాణించడంతో ఓ దశలో ఆసీస్‌ 350కి పైగా పరుగులు సాధింస్తందునుకున్నారు. అయితే పాక్‌ స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ అమిర్‌ చెలరేగడంతో ఆసీస్‌ మిడిలార్డర్‌ కకలావికలం అయింది. దీంతో 307 పరుగులకే పరిమితమైంది. పాక్‌ బౌలర్లలో అమిర్‌(5/30), షాహిన్‌ ఆఫ్రిది(2/70)లు రాణించారు.


చదవండి:
ఆ ప్రకటనలపై సానియా ఫైర్‌
ఇంగ్లండ్‌కు పయనమైన పంత్‌
పాక్‌తో మ్యాచ్‌: ఆసీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత

మరిన్ని వార్తలు