భళా.. బంగ్లా

17 Jun, 2019 23:06 IST|Sakshi

టాంటాన్‌ : సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్‌.. మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం స్థానిక మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. మరో 51 బంతులు మిగిలుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. బంగ్లా ఆటగాళ్లలో సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌(124నాటౌట్‌; 99 బంతుల్లో 16ఫోర్లు) సెంచరీతో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. షకీబుల్‌కు తోడుగా లిట్టన్‌ దాస్‌(94 నాటౌట్‌; 69 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, తమీమ్‌(48) పర్వాలేదనిపించాడు.  విండీస్‌ బౌలర్లలో రసెల్‌, థామస్‌లకు చెరో వికెట్‌ దక్కింది. సెంచరీతో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

విండీస్‌కు ఊహించని పరిణామం
321 పరుగులు చేశాక కూడా ఓడిపాతమని విండీస్‌ కలలో కూడా ఊహించకపోవచ్చు. బలమైన బౌలింగ్‌ లైనప్‌, మెరుపు ఫీల్డింగ్‌ గల విండీస్‌పై బంగ్లా గెలుస్తుందని కనీసం ఎవరూ కూడా అంచనా వేయలేకపోయారు. అయితే సీనియర్‌ ఆటగాడు షకీబ్‌ తన అనుభవంతో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చివరి వరకు ఉండి బంగ్లాకు విజయాన్ని అందించాడు. షకీబ్‌కు తోడుగా తమీమ్‌ ఆకట్టుకున్నాడు. అయితే లిట్టన్‌ దాస్‌ వచ్చాక మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన దాస్‌ విజయాన్ని త్వరగా పూర్తి కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. వీరిద్దరి సూపర్‌ షోతో బంగ్లా క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. 

విధ్వంసకరులు సున్నాకే పరిమితం
అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. విండీస్‌ ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(70; 67 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), షాయ్‌ హోప్‌(96; 121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హెట్‌ మెయిర్‌(50; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించడంతో పాటు జేసన్‌ హోల్డర్‌(33; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.  ఈ మ్యాచ్‌లో విండీస్‌ విధ్వంసకర ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, రసెల్‌లు పరుగులేమి చేయకుండానే ఔటవ్వడం గమనార్హం. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌, సైఫుద్దీన్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టగా.. షకీబ్‌ రెండు వికెట్లు నేలకూల్చాడు. 
 

మరిన్ని వార్తలు