ప్రపంచకప్‌కు దూరం.. ధావన్‌ భావోద్వేగం

19 Jun, 2019 21:15 IST|Sakshi

లండన్‌: ఎడమచేతి బొటనవేలుకు గాయం కావటంతో టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ 2019లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. అయితే తొలుత మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది. ధావన్ స్థానంలో రిషబ్ పంత్ టీమిండియాకు 15 మంది బృంద సభ్యుల్లో చోటు దక్కించుకోనున్నాడు. ఈ మేరకు టీమ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణం ఒక ప్రకటనలో తెలిపాడు. 

ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి దూరం కావడంపై ధావన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. బీసీసీఐ అధికారిక ప్రకటన అనంతరం ధావన్‌ ఎంతో ఎమోషనల్‌​ అవుతూ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ‘బొటనవేలు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అవుతున్నాను. ఏది ఏమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్‌’అంటూ వీడియో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ధావన్‌ షేర్‌ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మైదానంలో గబ్బర్‌ ఆడే ఆటను, చేసే హడావుడిని మిస్ అవుతామని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ ఔట్‌)

మరిన్ని వార్తలు