ప్రపంచకప్‌ తొలి విజయం ఆతిథ్యానిదే

30 May, 2019 22:22 IST|Sakshi

దక్షిణాప్రికాను చిత్తుచిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌

టోర్నీని ఘనం ఆరంభించిన ఆతిథ్య జట్టు

లండన్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019ను ఇంగ్లండ్‌ విజయంతో ఆరంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌.. సఫారీ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డుప్లెసిస్‌ సేన 207 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌ హీరో జోఫ్రా ఆర్చర్‌(3/27), ఫ్లంకెట్‌(2/37), స్టోక్స్‌(2/12)లు దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డికాక్‌(68), డసెన్‌(50) ఫర్వాలేదనిపించారు. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు ఆమ్లా(13), డుప్లెసిస్‌(5), డుమినీ(8)లు పూర్తిగా నిరాశపరిచారు.  ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న బెన్‌ స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

ఒత్తిడిలో సఫారీ చిత్తుచిత్తు..
మామూలుగానే ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడికి చిత్తయ్యే అలవాటున్న సఫారీ జట్టు.. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లోనూ అదే పంథాను కొనసాగించింది. భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు సరైన శుభారంభం లభించలేదు. ఆరంభంలోనే హషీమ్‌ ఆమ్లా (13) హెల్మెట్‌ గ్రిల్స్‌కు బంతి బలంగా తాకడంతో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మార్కమ్‌ (11)ను ఔట్‌ చేసి జోఫ్రా ఆర్చర్‌ వికెట్ల వేటను ఆరంభించాడు. సఫారీ సారథి డుప్లెసిస్‌ (5)నూ అతడే పెవిలియన్‌ పంపించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో క్వింటన్‌ డికాక్‌ (68), రసి వాన్‌ డెర్‌ డసెన్‌ (50) క్రీజులో నిలిచారు. 4వ వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం సాధించిన డికాక్‌ను ప్లంకెట్‌ కీలక సమయంలో ఔట్‌ చేశాడు. అప్పుడు స్కోరు 129/2. ఆచితూచి పరుగులు సాధిస్తున్న డసెన్‌ నిలిచినా మరోవైపు డుమిని (8), ప్రిటోరియస్‌ (1) వెంటవెంటనే ఔటయ్యారు. అర్ధశతకం తర్వాత డసెన్‌ను జట్టు స్కోరు 167 వద్ద జోఫ్రా పెవిలియన్‌ పంపాడు. అండిలె ఫెలుక్‌వాయో (24) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టులో జేసన్‌ రాయ్‌(54: 53 బంతుల్లో 8 ఫోర్లు), జో రూట్‌(51: 59 బంతుల్లో 5 ఫోర్లు), ఇయాన్‌ మోర్గాన్‌(57: 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్‌ స్టోక్స్‌( 89: 79 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించి జట్టు మూడొందలకు పైగా స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ జేసన్‌ రాయ్‌, జో రూట్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్‌ రాయ్‌ పెవిలియన్‌ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో రూట్‌ కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో మోర్గాన్‌-బెన్‌ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టే బాధ్యతను తీసుకుంది.

వీరిద్దరూ మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి గాడిలో పెట్టారు. కాగా, మోర్గాన్‌ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత జోస్‌ బట్లర్‌(18), మొయిన్‌ అలీ(3)లు నిరాశపరచడంతో ఇంగ్లండ్‌ తడబడినట్లు కనిపించింది. అయితే బెన్‌ స్టోక్స్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి జట్టును మూడొందలకు చేర్చిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో స్టోక్స్‌ 49 ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌(7 నాటౌట్‌), ప్లంకెట్‌(9 నాటౌట్‌)లు 11 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా,రబడా, తాహీర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫెహ్లుకోవియా వికెట్‌ తీశాడు.

మరిన్ని వార్తలు