ఛేదించలేక.. చేతులెత్తేశారు

30 Jun, 2019 23:23 IST|Sakshi

ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూసిన కోహ్లి సేన

విజయంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలు సజీవం

బర్మింగ్‌హామ్‌ : భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. సెమీస్‌కు చేరాలంటే తాడోపేడో తేల్చుకో వాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది. బలమైన భాగస్వామ్యాలు నమోదు చేయక, కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్న కోహ్లిసేన ఆతిథ్య ఇంగ్లండ్‌కు చేజేతులా విజయాన్ని అందించింది. నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చాంపియన్‌ ఆటను ప్రదర్శించింది.  ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమి ప్రపంచకప్‌లో టీమిండియాకు మొదటిది కాగా.. ఈ విజయంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలు బలపడ్డాయి. 

రోహిత్‌, కోహ్లిలు మినహా..
ఇంగ్లండ్‌ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేన నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 306 పరుగులకే పరిమితమైంది. టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (102; 109 బంతుల్లో 15ఫోర్లు) శతకంతో రాణించినప్పటికీ జట్టుకు అవసరమైన దశలో అవుటై నిరాశపరిచాడు. రోహిత్‌కు తోడుగా సారథి విరాట్‌ కోహ్లి(66; 76 బంతుల్లో 7 ఫోర్లు) ఆర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎన్నో అంచనాలతో తుదిజట్టులో చోటు దక్కించుకున్న రిషభ్‌ పంత్‌(32) తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్లంకెట్‌ మూడు వికెట్లతో రాణించగా.. వోక్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. తొమ్మిది బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ నిష్క్రమించాడు. దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను రోహిత్‌, కోహ్లిలు తీసుకున్నారు. ఆరంభంలో పరుగులు తీయడానికి నానాతంటాలు పడిన వీరిద్దరూ కుదురుకున్నాక స్కోర్‌ బోర్డు పరిగెత్తించారు. అయితే మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో కోహ్లి ఓ చెత్త షాట్‌ ఆడి వెనుదిరుగుతాడు. అప్పటినుంచి ఏ దశలోనూ టీమిండియా విజయంవైపు పయనించలేదు. పాండ్యా(45) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించినప్పటికీ జట్టు విజయానికి ఉపయోగపడలేదు. చివర్లో ధోని(41 నాటౌట్‌), కేదార్‌ జాదవ్‌(12 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 

అంతకుముందు ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ బెయిర్‌స్టో (111: 109 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) మెరుపు శతకానికి తోడు బెన్‌స్టోక్స్‌(79: 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌(66: 57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ(5/69)కి ఐదు వికెట్లు దక్కాయి. బుమ్రా(1/44) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 

ఆరంభం.. ఆఖరు అదుర్స్‌ 
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో అదిరే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ తొలి వికెట్‌కు ఏకంగా 160 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఆ తర్వాత మరింత చెలరేగుతున్న ఈ జోడీని ఎట్టకేలకు కుల్‌దీప్‌ విడదీశాడు. అతని బౌలింగ్‌లో రాయ్‌ ఇచ్చిన క్యాచ్‌ను జడేజా అద్భుత రీతిలో అందుకోవడంతో తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం జతకలసిన రూట్‌(44: 54 బంతుల్లో 2 ఫోర్లు)తో కలసి బెయిర్‌స్టో మరో ఉపయుక్త భాగస్వామ్యం(45) నెలకొల్పాడు. 

ఈ క్రమంలో సరిగ్గా వంద బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత జోరు పెంచే క్రమంలో షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్‌(1)ను సైతం షమీ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో రూట్, స్టోక్స్‌ ఆచితూచి ఆడారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు అర్ధసెంచరీ(72) భాగస్వామ్యం ఏర్పరిచాక రూట్‌ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం బట్లర్‌ (20: 1 ఫోర్, 2 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లాడు. 

ఆ వెంటనే వోక్స్‌(7) సైతం పెవిలియన్‌కు చేరాడు. దీంతో బ్యాట్‌ ఝళిపించిన స్టోక్స్‌ ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. ఒకదశలో 400 చేస్తుందేమో అనుకున్న ఇంగ్లండ్‌ మధ్య ఓవర్లలో తడబడినప్పటికీ స్టోక్స్‌ కారణంగా ఆఖరి 10 ఓవర్లలో 92 పరుగులు పిండుకుంది. భారత స్పిన్నర్లు చాహల్‌(0/88), కుల్దీప్‌ యాదవ్‌(1/72) పూర్తిగా తేలిపోయారు. 

మరిన్ని వార్తలు