కివీస్‌ గెలుస్తుందా.. అవకాశం ఇస్తుందా?

3 Jul, 2019 16:47 IST|Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు అదిరే ఆరంభం లభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు ఇద్దరూ అర్దసెంచరీలతో ఆకట్టుకున్నారు. తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించిన అనంతరం జాసన్‌ రాయ్‌(60)ను నీషమ్‌ ఔట్‌ చేసి ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 23 ఓవర్లలో ఒక్క వికెట్‌ నష్టానికి 145 పరుగులు చేసింది.  బెయిర్‌ స్టో(69 నాటౌట్‌)కు తోడుగా జోయ్‌ రూట్‌(7 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా సెమీస్‌కు వెళ్లాలని ఆతిథ్య ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఒకవేళ కివీస్‌పై ఓడిపోతే రన్‌రేట్‌ కీలకమవుతుంది. పాకిస్తాన్‌ జట్టు సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలవాలి. దీంతో మైదానంలో కివీస్‌తో పాటు పాక్‌ ఫ్యాన్స్‌ ఇంగ్లండ్‌ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఇక లీగ్‌ చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు రెట్టింపు ఉత్సాహంతో వెళ్లాలని కివీస్‌ ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా కివీస్‌ రెండు మార్పులు చేసింది. ఫెర్గుసన్‌, ఇష్‌ సోధిలను పక్కకు పెట్టి టిమ్‌ సౌథీ, మార్క్‌ హెన్రీలను తుదిజట్టులోకి తీసుకుంది. 

మరిన్ని వార్తలు