ఇంగ్లండ్‌.. 305 కాపాడుకునేనా?

3 Jul, 2019 18:59 IST|Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా సెమీస్‌కు నేరుగా వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్‌తో మరోసారి మెరిసింది. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌కు ఆతిథ్య ఇంగ్లండ్‌ మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఓపెనర్‌ బెయిర్‌ స్టో (106; 99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌) విధ్వంసానికి తోడు జేసన్‌ రాయ్‌(60; 61 బంతుల్లో 8ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. సారథి ఇయాన్‌ మోర్గాన్‌(42) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బౌల్ట్‌, నీషమ్‌‌, హెన్రీలు తలో రెండు వికెట్ల పడగొట్టగా.. సౌథీ, సాంట్నర్‌లు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

బెయిర్‌ స్టో- రాయ్‌ల సూపర్‌ ఇన్నింగ్స్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్‌ బోర్డు పరిగెత్తించారు. వీరిద్దరి జోరుకు ఇంగ్లండ్‌ 15 ఓవర్లకే వంద పరుగులు సాధించింది. ఈ క్రమంలో వీర్దిదరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్‌ సెంచరీ అనంతరం రాయ్‌ను నీషమ్‌ ఔట్‌ చేసి కివీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బెయిర్‌ స్టో మరింత రెచ్చిపోయి ఆడాడు.

టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి బెయిర్‌ స్టో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో అతడికి రెండో సెంచరీ కావడం విశేషం. అనంతరం మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అవుతాడు. అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్చగా పరుగులు తీయడానికి ఇబ్బందులు పడ్డారు. రూట్‌(24), బట్లర్‌(11), స్టోక్స్‌(11), వోక్స్‌(4)లు వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో రషీద్‌(16‌), ఫ్లంకెట్‌(15 నాటౌట్‌) ధాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో ఇంగ్లండ్‌ 300 పరుగులు దాటింది. 

మరిన్ని వార్తలు