మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌

18 Jun, 2019 18:42 IST|Sakshi

బౌలింగ్‌లో తేలిపోయిన రషీద్‌

సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్‌

అప్గానిస్తాన్‌ లక్ష్యం 398

మాంచెస్టర్‌ : ఇయాన్‌ మోర్గాన్ (148; 71 బంతుల్లో 4ఫోర్లు, 17 సిక్సర్లు) అఫ్గానిస్తాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ చెలరేగడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ 398పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో మోర్గాన్‌కు తోడు బెయిర్‌ స్టో(90; 99 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు), జోయ్‌ రూట్‌(88; 82 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్‌)లు రాణించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. అఫ్గాన్‌ బౌలర్లలో సారథి గుల్బదిన్‌, జద్రాన్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు.

బెయిర్‌ స్టో-రూట్‌ల భాగస్వామ్యం
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించిన అనంతరం విన్స్‌(26)ను జద్రాన్‌ ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్‌తో కలిసి బెయిర్‌ స్టో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. తొలుత నిదానంగా ఆడిన వీరిద్దరూ అనంతరం గేర్‌ మార్చి పరుగులు రాబట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం సెంచరీ చేస్తాడనుకున్న బెయిర్‌ స్టో 90 పరుగుల వద్ద అవుటై నిరాశపరిచాడు. 

మోర్గాన్‌ సిక్సర్ల వర్షం..
బెయిర్‌ స్టో ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వస్తువస్తూనే అఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మోర్గాన్‌ వచ్చిన తర్వాత మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు నిదానంగా సాగిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సారథి క్రీజులోకి వచ్చిన అనంతరం భీభత్సంగా మారింది. సిక్సర్‌తోనే అర్థ సెంచరీ, సెంచరీ సాధించి ఆశ్చర్యపరిచాడు. కేవలం 57 బంతుల్లోనే సెంచరీ సాధించిన మోర్గాన్‌.. ప్రపంచకప్‌లో నాలుగో​ వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మోర్గాన్‌ విధ్వంసంతో పాటు రూట్‌ నిలకడైన ఆటతో మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక చివర్లో భారీ షాట్‌లు ఆడే క్రమంలో మోర్గాన్‌, రూట్‌, బట్లర్‌, స్టోక్స్‌లు వెంటవెంటనే ఔటయ్యారు. 
 
రషీద్‌ ఖాన్‌ ‘సెంచరీ’   
ఐపీఎల్‌, అఫ్గాన్‌ స్ట్రార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. అత్యంత చెత్త బౌలింగ్‌తో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లోనే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏకంగా 11 సిక్సర్లు కొట్టడం గమనార్హం. రషీద్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడిన ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ సులువుగా పరుగుల రాబట్టారు. ఈ మ్యాచ్‌లో రషీద్‌ 9 ఓవర్లు వేయగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన స్టార్‌ స్పిన్నర్‌గా రషీద్‌ రికార్డు నెలకొల్పాడు.  

మరిన్ని వార్తలు