‘టాస్‌ గెలిచి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌’

13 Jun, 2019 21:15 IST|Sakshi

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న తాజా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఎడిషన్‌ అత్యంత విమర్శల పాలవుతోంది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడం పట్ల క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం జరగాల్సిన టీమిండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఐసీసీ, ఇంగ్లండ్‌పై విరుచుకపడుతున్నారు. సెటైరికల్‌ మీమ్స్‌ను సోషల్ మీడియాలో పెట్టి జోకులు వదులుతున్నారు.  

మరో రెండు మూడు మ్యాచ్ లను వర్షం అడ్డుకుంటే, చాంపియన్ ఎవరో తేల్చాల్సిన అవసరం లేదని, ఆడకుండానే ఎవరో ఒకరు కప్పెత్తుకు పోతారని మండిపడుతున్నారు. ‘నేటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి స్మిమ్మింగ్‌ ఎంచుక్నున టీమిండియా’, ‘ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడాలంటే అండర్‌ వాటర్‌లో ఆడటం నేర్చుకోవాలి’, ‘ప్రపంచకప్‌, వర్షం రెండూ ఇంగ్లండ్‌ను వదలడం లేదు’, ‘టాస్‌ గెలిచిన వాతావరణం తొలుత వర్షాన్ని ఎంచుకుంది’, ‘ఈ ప్రపంచకప్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు వర్షం నీటిని ఎత్తిపోసిన సిబ్బందికి ఇవ్వాలి’అంటూ కామెంట్‌ పెడుతున్నారు. 


మరిన్ని వార్తలు