కోహ్లి అంచనాలే నిజమవుతున్నాయి?

28 Jun, 2019 20:18 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌ కంటే ముందు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిని కింగ్‌, మాస్టర్‌, గోట్‌ అంటూ ఎవరికి నచ్చినట్టు వారు సంభోదించారు. అయితే టోర్నీ సగం పూర్తయిన తర్వాత అతడిని జ్యోతిష్కుడు, జ్ఞాని అంటూ కొందరు క్రీడా విశ్లేషకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీనికి కారణం కోహ్లి అంచనాలు నిజమవడమే. ప్రపంచకప్‌ ఆరంభానికంటే ముందు ఐసీసీ ఏర్పాటు చేసిన కెప్టెన్ల అధికారిక సమావేశంలో ఆట గురించి కెప్టెన్లంతా మాట కలిపారు. సన్నాహాలు మొదలు... ఎదురయ్యే సవాళ్లపై స్పష్టమైన సమాధానాలిచ్చారు.
భారీ స్కోర్లతో భారమైన టోర్నీ జరుగుతుందని, 350 పరుగులు చేసినా గెలుపు ధీమా ఉండబోదనే పలువురు సారథులు అభిప్రాయపడ్డారు. కానీ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మాత్రం 250 పరుగులు కూడా కాపాడుకోవచ్చన్నాడు. ‘అతనిలో ఏమా ధీమా’ అనేలోపు అర్థవంతమైన వివరణ ఇచ్చాడు. మొదట్లో 300 అవలీలగా ఛేదించినా... మ్యాచ్‌లు జరిగే కొద్దీ పిచ్‌లు మారిపోతాయని విశ్లేషించాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో కోహ్లి ఏం చెప్పాడో అదే జరుగుతోంది.  కోహ్లి అంచనాలు నిజమవుతుండటంతో క్రీడా పండితులు అతడిని జ్ఙానితో పోల్చుతున్నారు.

ఈ మెగా ఈవెంట్‌కు కొన్ని వారాల ముందు జరిగిన ఇంగ్లండ్, పాకిస్తాన్‌ సిరీస్‌తో అందరిలోనూ పలు అనుమానాలు మొదలయ్యాయి. ఈ సిరీస్‌లో 340కి పైగా పరుగులు సాధించినా పాక్‌ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రపంచకప్‌లో 500 స్కోర్‌ నమోదువుతుందని అందరూ భావించారు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జోయ్‌ రూట్‌ ఈ ప్రపంచకప్‌లో 500 స్కోర్‌ను చూస్తామని చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలయింది. అయితే టోర్నీ ప్రారంభంలో కొన్ని జట్లు అవలీలగా 300కిపైగా పరుగులు సాధించాయి. కానీ టోర్నీ జరుగుతున్నా కొద్దీ పిచ్‌లు మందకొడిగా మారుతుండటంతో స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. (చదవండి: కోహ్లి దళం... గెలుస్తుందా హృదయం?)

అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌లపై సాధారణ స్కోర్లు నమోదు చేసినప్పటికీ అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయం సాధించింది. ఇక అత్యంత దుర్బేద్యంగా బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి, భారీ స్కోర్లు నమోదు చేసే ఇంగ్లండ్‌ కూడా 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంకపై ఓడిపోయింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్లపై లక్ష్యాన్ని ఛేదించలేక ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 245 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించడానికి న్యూజిలాండ్‌కు చుక్కలు కనిపించాయి. ఇంకా పలు మ్యాచ్‌ల్లో కూడా స్వల్ప స్కోర్లే నమోదు కావడంతో కోహ్లి అంచనాలు నిజమవుతున్నాయని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. (చదవండిహార్దిక్‌ను రెండు వారాలు ఇవ్వండి)

మరిన్ని వార్తలు