కోహ్లి ఖాతాలో మరో రికార్డు

16 Jun, 2019 18:28 IST|Sakshi

మాంచెస్టర్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగులు చేయడంతో వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో ఆటగాడిగా ఆరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లో 11వేల మార్క్ అందుకోగా.. కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. 

అంతేకాకుండా, క్రికెట్‌లోకి వచ్చిన 11 ఏళ్ల లోపే ఈ ఘనతను సొంతం చేసుకున్న ఆటగాడిగానూ కోహ్లి రికార్డుల్లో నిలిచాడు.  ఇక భారత్ తరఫున ఇప్పటివరకు గంగూలీ, సచిన్ మాత్రమే ఈ ఫీట్‌ నమోదు చేశారు. ఈ జాబితాలో గంగూలీని అధిగమించి.. ఎనిమిదో స్థానానికి కోహ్లి ఈ ప్రపంచకప్‌లోనే ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. గంగూలీ 11,363 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లి ఈ పరుగులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. 
 

మరిన్ని వార్తలు