ఇంగ్లండ్‌పై ఎలా గెలిచామంటే..

22 Jun, 2019 20:24 IST|Sakshi

లీడ్స్‌: ప్రపంచకప్‌లో భాగంగా బలమైన ఇంగ్లండ్‌ను ఓడించి శ్రీలంక అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ వీరంగంతో ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ తోకముడిచారు. గత కొన్నాళ్లుగా 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్‌ 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను మలింగ కూల్చగా.. స్పిన్నర్‌ ధనుంజయ్‌ డిసిల్వా లోయార్డర్‌ పనిపట్టాడు. దీంతో విజయం లంక వాకిట నిలిచింది. మ్యాచ్‌ అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మలింగ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడానికి పక్కా వ్యూహాలు రచించి అమలుచేశామని తెలిపాడు.
‘గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌ అవలీలగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ విజయాలను నమోదు చేస్తున్నారు. అయితే మేం నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడు కోవాలంటే బౌలింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని నిశ్చయించుకున్నాం. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ తప్పకూడదు.. అదే విధంగా చెత్త బంతులు వేయకూడదనే బేసిక్‌ ప్రణాళికను అమలు చేశాం. అంతేకాకుండా బౌన్సర్లను కూడా వివిధ వేరియేషన్స్‌తో వేయాలనుకున్నాం. స్టోక్స్‌ ఓ ఎండ్‌లో రెచ్చిపోతుండటంతో స్టాక్‌ బాల్స్‌తో అతడిని బోల్తా కొట్టించాలనుకున్నాం. కానీ స్టోక్స్‌ అద్బుతంగా ఆడాడు. ఇక బట్లర్‌ను ఆరంభంలోనే ఔట్‌ చేయాలనుకున్నాం. ఎందుకంటే కుదురుకుంటే రెచ్చిపోతాడు. అందుకే అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాం. అన్ని పక్కాగా అమలు చేయడంతో ఇంగ్లండ్‌పై విజయం సాధించాం’అంటూ మలింగ వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మలింగ నాలుగు వికెట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు