మంజ్రేకర్‌ ఇప్పుడేమంటావ్‌?

10 Jul, 2019 21:10 IST|Sakshi

హైదరాబాద్‌ : ప్రపంచకప్‌ సెమీస్‌లోనే టీమిండియా ఇంటిబాట పట్టడంపై యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నిరాశకు గురిచేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఒకానొక దశలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడుతుందని అందరూ భావించారు. అయితే రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనిల సూపర్‌ షోతో భారీ ఓటమి నుంచి కోహ్లి సేన తప్పించుకుంది. ముఖ్యంగా రవీంద్ర జడేజా చూపించిన తెగువ అందరినీ ఆకట్టుకుంది. ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను విజయపుటంచుల వరకు తీసుకెళ్లాడు. చివర్లో వికెట్లు చేజార్చుకోవడంతో కోహ్లిసేన ఓటమి చవిచూసింది. అయితే భారత్‌ ఓటమి చవిచూసినా జడేజా తన ఆటతో అందరి హృదయాలను గెలుచుకున్నాడంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

గత కొద్ది రోజులుగా జడేజాను తిడుతూ వచ్చిన మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా సెమీస్‌లో జడేజా చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో మంజ్రేకర్‌పై జడేజా అభిమానులు, నెటిజన్లు వ్యంగ్యాస్త్రాల సంధిస్తున్నారు. ‘గల్లీ క్రికెటర్‌ అన్నావు కదా ఇప్పుడేమంటావ్‌’, ‘ 1983 ప్రపంచకప్‌ సెమీస్‌లో కపిల్‌దేవ్‌ ఆటను జడేజా గుర్తుచేశాడు’, ‘ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదని ఈ మ్యాచ్‌తో మంజ్రేకర్‌కు అర్దమైందనుకుంటా’, ‘నీ అసాధారణ పోరాటంతో టీమిండియా భారీ ఓటమి నుంచి తప్పించి పరువు కాపాడావు’, ‘నిజమైన త్రీ డైమెన్షన్‌ ప్లేయర్‌ అంటే జడేజానే’ అంటూ నెటిజన్లు జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (చదవండి: వాగుడు ఆపమన్నా.. మంజ్రేకర్‌ వింటేగా!)


చదవండి: 
ఇక నీ చెత్త వాగుడు ఆపు: జడేజా 
లక్షలాది గుండెలు పగిలాయి

మరిన్ని వార్తలు