‘బర్మింగ్‌హామ్‌కు టీమిండియాను తీసుకురండి’

4 Jul, 2019 20:06 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : హాట్‌ ఫేవరెట్‌గా ప్రపంచ కప్‌ను మొదలుపెట్టి, ఓ దశలో అనూహ్య ఓటములతో ముప్పు కొనితెచ్చుకున్న ఆతిథ్య ఇంగ్లండ్‌.. కీలక సమయంలో జూలు విదిల్చి 1992 తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ సెమీఫైనల్‌ మెట్టెక్కింది. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ 119 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుని నాకౌట్‌కు దూసుకెళ్లింది. అయితే మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌.. సెమీస్‌లో ఏ జట్టును(ఆస్ట్రేలియా లేక భారత్‌)ఎదుర్కొంటుంది అనే అంశంపై ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీ​వ్రంగా చర్చిస్తున్నారు. 

తాజాగా ఈ అంశంపై ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకెల్‌ వాన్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘ అద్భుతమైన ప్రదర్శన. గత కొద్ది రోజులుగా ఇంగ్లండ్‌ మానసికంగా ధృడంగా ఉంది. సరైన సమయంలో చాంపియన్‌ ఆట తీరును ప్రదర్శించింది. బర్మింగ్‌హామ్‌కు టీమిండియాను తీసుకరండి’అంటూ ట్వీట్‌ చేశాడు. వాన్‌ ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియాను ఓడించే ఇంగ్లండ్‌ ఫైనల్‌కు చేరుతుందని ఇది గుర్తుపెట్టుకోండి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: క్రికెట్‌ను వదిలేస్తున్నా...)

ప్రస్తుత సారథి ఇయాన్‌ మోర్గాన్‌ కూడా ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. భారత్‌ను ఓడించిన బర్మింగ్‌హామ్‌లోనే సెమీస్‌ ఆడనుండటం తమకు కలిసొచ్చే అంశమని మోర్గాన్‌ పేర్కొన్నాడు. ఇక లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా శనివారం భారత్‌ శ్రీలంకతో, ఆసీస్‌ దక్షిణాఫ్రికాతో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో ఆసీస్‌, భారత్‌ గెలిస్తే.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో కోహ్లి సేన తలపడుతుంది. ఒకవేళ ఆసీస్‌ను సఫారీ జట్టు ఓడించి.. శ్రీలంకపై భారత్‌ గెలిస్తే సమీకరణాలు పూర్తిగా మారతాయి. పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో ఉండే భారత్‌ సెమీస్‌లో కివీస్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 

చదవండి:
కోహ్లి సేనకు ఇంగ్లండ్‌ గండం తప్పాలంటే..
కనీసం 316 పరుగులతో గెలవాలి..అయితేనే!!

మరిన్ని వార్తలు