ఆఖరికి కివీస్‌దే విజయం..

20 Jun, 2019 00:27 IST|Sakshi

దక్షిణాఫ్రికాకు తప్పని నాలుగో ఓటమి

విలియమ్సన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

లోస్కోర్‌ మ్యాచ్‌లో కివీస్‌దే విజయం

బర్మింగ్‌హామ్‌ : ప్రపంచకప్‌లో ఉత్కంఠభరిత పోరు. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌.. దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీలో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టును నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కివీస్‌ ఆటగాళ్లలో సారథి కేన్‌ విలియమ్సన్‌(106నాటౌట్‌; 138 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్‌) సెంచరీతో కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. గ్రాండ్‌హోమ్‌(60; 47బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో కివీస్‌ విజయాన్ని అందుకుంది. సఫారీ బౌలర్లలో మోరిస్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. రబడా, ఎన్‌గిడి, ఫెహ్లుకోవియా తలో వికెట్‌ దక్కించుకున్నారు. జట్టుకు విజయాన్ని అందించిన విలియమ్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు’​ లభించింది. 

అంతకుముందు ఓపెనర్‌ హషీం ఆమ్లా (83 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), మిడి లార్డర్‌లో వాన్‌ డర్‌ డుస్సెన్‌ (64 బం తుల్లో 67 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకోవడంతో దక్షిణాఫ్రికా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. వర్షం కారణంగా ఒక ఓవర్‌ కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్‌పై తడి ఉండడం, మ్యాచ్‌కు ముందు కొద్దిసేపు వర్షం కురవడంతో బంతి బాగా స్వింగ్‌ అయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న కివీస్‌ బౌలర్లు ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్‌ డికాక్‌(5) త్వరగానే వెనుదిరగ్గా, డుప్లెసిస్‌(23), మర్‌క్రమ్‌(38), డేవిడ్‌ మిల్లర్‌(36) వేగంగా ఆడలేకపోయారు. ఇక కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌ 3 వికెట్లు తీయగా, ట్రెంట్‌ బౌల్ట్, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్, మిచెల్‌ సాంట్నర్‌ తలొక వికెట్‌ పడగొట్టారు. 

>
మరిన్ని వార్తలు