-

విలియమ్సన్‌ మరో శతకం.. విండీస్‌ లక్ష్యం 292

22 Jun, 2019 22:08 IST|Sakshi

మాంచెస్టర్‌ : ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో కేన్‌ విలియమ్సన్‌ వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చివరివరకు ఉండి శతకం బాది జట్టుకు విజయాన్ని అందించిన కివీస్‌ సారథి.. విండీస్‌తో మ్యాచ్‌లోనూ కష్టాల్లో ఉన్న తమ జట్టును భారీ శతకం సాధించి ఆదుకున్నాడు. సారథి విలియమ్సన్‌(148; 154బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సర్‌)కు తోడు సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌(69; 95 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. బ్రాత్‌వైట్‌ రెండు, గేల్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నారు. 

షాకిచ్చిన కాట్రెల్‌..
టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌కు షెల్డన్‌ కాట్రెల్‌ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. తొలి ఓవర్‌లోనే గప్టిల్‌(0), మున్రో(0)లను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు పంపించి కివీస్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను సీనియర్‌ ఆటగాళ్లు విలియమ్సన్‌-రాస్‌ టేలర్‌లు తీసుకున్నారు. వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడుతూ విండీస్‌ బౌలర్లకు పరీక్ష పెట్టారు.

విలియమ్సన్‌-టేలర్‌ల భాగస్వామ్యం 
కష్టకాలంలో ఉన్న కివీస్‌ను నిలబెట్టింది విలియమ్సన్‌-టేలర్‌ల భాగస్వామ్యమే. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పరిగెత్తించారు. ఈ క్రమంలో వీర్దిదరూ అర్దసెంచరీలు నమోదు చేశారు. అనంతరం టేలర్‌ ఔట్‌ అవడంతో మూడో వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం సెంచరీ పూర్తి చేసిన విలియమ్సన్‌ స్కోర్‌ పెంచే క్రమంలో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరుగుతాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు అంతగా రాణించకపోడంతో కివీస్‌ 300 పరుగుల స్కోర్‌ దాటలేకపోయింది.

మరిన్ని వార్తలు