ఇంగ్లండ్‌పై పాక్‌ జయభేరి

3 Jun, 2019 23:29 IST|Sakshi

14 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఓటమి

జో రూట్‌, బట్లర్‌ శతకాలు వృథా​

ఆల్‌రౌండ్‌ ప్రదర్శణతో ఆకట్టుకున్న పాక్‌

నాటింగ్‌హామ్‌ : సంచలనాల పాకిస్తాన్‌ చేతిలో ఇంగ్లండ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. భారీ లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తూ విజయాలను అందుకుంటున్న ఇంగ్లండ్‌కు పాకిస్తాన్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా స్థానిక ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో పాక్‌ జయభేరి మోగించింది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాక్‌ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గాడిలో పడింది. అన్ని విభాగాల్లో పాక్‌ కంటే బలంగా ఉన్నా ఆతిథ్య జట్టుదే విజయమని భావించారు. అయితే సంచలనాలకు మారుపేరు అయిన పాక్‌ ఇంగ్లండ్‌ను ఘోరంగా ఓడించింది. 

పాకిస్తాన్‌ నిర్దేశించిన 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు సరైన శుభారంభాన్ని అందించలేదు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(8) తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం బెయిర్‌ స్టో(32), మోర్గాన్‌(9), స్టోక్స్‌(13)లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ సమయంలో జో రూట్‌, బట్లర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీర్దిదరూ స్కోర్‌ బోర్డు వేగం పెంచారు. అయితే జో రూట్‌(107; 104 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం తర్వాత షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరికాసేపటికే శతకం చేసిన బట్లర్‌(103; 76 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు)ను అమిర్‌ బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమైంది. పాక్‌ బౌలర్లలో వాహబ్‌ రియాజ్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. షాదాబ్‌, అమిర్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఫకార్‌ జమాన్‌(36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్‌ అజామ్‌(63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హఫీజ్‌ ‌(84: 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్పరాజ్‌ అహ్మద్‌(55: 44 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించడంతో పాక్‌ నిర్ణీత ఓవర్లలో  ఎనిమిది వికెట్ల నష్లానికి 348 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, మార్క్‌వుడ్‌ రెండు వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు