ప్రపంచకప్‌ ‘సెమీస్‌’ చేరేదెవరు?

30 Jun, 2019 18:25 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న క్రికెట్‌ విశ్వసమరం రసవత్తరంగా మారుతోంది. టోర్నీ ఆరంభంలో వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుతుండటంతో సెమీస్‌ నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే ప్రపంచకప్‌లో పాల్గొన్న పది జట్లలో మూడు జట్లు(దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌) అధికారికంగా సెమీస్‌ రేసు నిష్క్రమించాయి. ఇప్పటికే శ్రీలంక అనధికారికంగా సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. మిగిలిన ఆరు జట్లలో 14 పాయింట్లతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది.

న్యూజిలాండ్‌, టీమిండియా జట్లు సెమీస్‌ చేరడం కష్టమేమీ కానప్పటికీ తదుపరి ఆడే మ్యాచ్‌లు వాటికి కీలకంగా మారనున్నాయి.  కాగా నాలుగో స్థానం కోసమే తీవ్రమైన పోటీ నెలకొంది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ గెలుపోటములుతో సతమతమవుతోంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు పలు సంచలనాల విజయాలు నమోదు చేసి సెమీస్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ప్రపంచకప్‌ మరింత ఉత్కంఠగా మారింది. దీంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఇంగ్లండ్‌ గెలిచి నిలిచేనా‌..
ఆతిథ్య ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో పాటు అభిమానులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. టోర్నీని ఘనంగా ఆరంభించి, భారీ విజయాలు నమోదు చేయడంతో ఈ సారి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ ఏదో చేయబోతుందని అందరూ భావించారు. కానీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి సీన్‌ రివర్సయింది. ఆసీస్‌ చేతిలో కంగుతిని, పాక్‌, లంక చేతిలో ఘోరంగా పరాజయం పాలయింది. దీంతో ఏకంగా సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి బలమైన టీమిండియా, కివీస్‌ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలకు గండిపడుతుంది. (చదవండి: శ్రీలంకకు షాక్‌)  

పాక్‌ రిపీట్‌ చేస్తుందా..
అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్‌ తాజా ప్రపంచకప్‌ను ఓటమితో ప్రారంభించి హ్యాట్రిక్‌ గెలుపుతో సెమీస్‌ రేసులో నిలిచింది. వెస్టిండీస్‌తో ఓటమి అనంతరం ఇంగ్లండ్‌ ఓడించి అందరికీ షాక్‌ ఇచ్చింది. అనంతరం ఆసీస్‌, టీమిండియాపై ఓడిపోయి విమర్శల పాలైంది. నెలకు కొట్టిన బంతిలా పుంజుకొని దక్షిణాఫ్రికాను ఇంటికి పంపించి, కివీస్‌పై స్పూర్తి దాయక విజయం అందుకొని, అఫ్గానిస్తాన్‌ను చిత్తుచేసింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన పాక్‌ నాలుగు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓటమిచెంది, ఒక్క మ్యాచ్‌ రద్దయింది. దీంతో 9 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాక్‌ సెమీస్‌ చేరాలంటే తదుపరి బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి.. అంతేకాకుండా ఇంగ్లండ్‌ రెండు మ్యాచ్‌లు ఓడిపోవాలి లేదంటే కనీసం ఒక్క మ్యాచైనా చిత్తుగా ఓడిపోవాలి. (చదవండి: పాక్‌ ఫ్యాన్స్‌ మద్దతు మనకే

బంగ్లాదేశ్‌కూ అవకాశాలు..
సంచలనాల బంగ్లాదేశ్‌ తాజా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలు పొందిన ఆ జట్టుకు ఒక్క మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఏడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌ల్లో తమ కంటే బలమైన టీమిండియా, పాకిస్తాన్‌ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో వైపు ఇంగ్లండ్‌ రెండు మ్యాచ్‌లు ఓడిపోతే బంగ్లా సెమీస్‌ వెళ్లే అవకాశం ఉంది. తమదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా ఓడించే బంగ్లా తన తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా ఆడుతుందో చూడాలి.

>
మరిన్ని వార్తలు