బంగ్లా షకీబ్‌.. నయా రికార్డ్‌

3 Jun, 2019 17:55 IST|Sakshi

లండన్‌: బంగ్లాదేశ్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ వేదికగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 5 వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అది కూడా అతివేగంగా(199 వన్డేల్లో) ఈ రికార్డు అందుకున్న ఆటగాడిగా షకీబ్ ఘనత సాధింంచాడు. ఈ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మన్‌ మార్కరమ్‌ వికెట్ తీయడంతో షకీబ్ 250 వికెట్ల ఘనతను సాధించాడు.

ఇప్పటివరకు అంతర్జాతీయ వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేసి 250 వికెట్స్ తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో జాక్వస్‌ కలిస్‌, సనత్ జయసూర్య, షాహిది అఫ్రిది, అబ్ధుల్ రజాక్ వంటి ఆటగాళ్లు మాత్రమే ఉండగా తాజాగా ఆ జాబితాలో చేరిన ఐదవ ఆటగాడిగా షకీబుల్‌ హసన్‌ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు సాధించడంతో పాటు, ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో షకీబ్‌.. రహీమ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో బంగ్లా 330 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 309 పరుగులకే పరిమితమైంది. దీంతో 21 పరుగుల తేడాతో బంగ్లా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.  

మరిన్ని వార్తలు