లంకను ముంచిన దక్షిణాఫ్రికా!

28 Jun, 2019 22:45 IST|Sakshi

ఎట్టకేలకు సఫారీలకు మరో విజయం

9 వికెట్లతో శ్రీలంక చిత్తు

ఆమ్లా, డు ప్లెసిస్‌ అర్ధసెంచరీలు

బౌలింగ్‌లో రాణించిన ప్రిటోరియస్, క్రిస్‌ మోరిస్‌

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ఎట్టకేలకు రెండో విజయం దక్కింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆ జట్టు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత మరో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో శ్రీలంకను చిత్తు చేసి కొంత సాంత్వన పొందింది. పనిలో పనిగా సఫారీలు తమ విజయంతో లంక సెమీస్‌ అవకాశాలను దెబ్బకొట్టారు. గత మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను ఓడించి ఆశలు రేపిన ద్వీప దేశం పేలవ బ్యాటింగ్‌తో తలవంచింది.

200 పరుగులు చేయడానికే చెమటోడ్చిన టీమ్‌ తమకు లభించిన అవకాశాన్ని స్వయంకృతంతో చేజార్చుకుంది. ఫలితంగా మాజీ చాంపియన్‌కు మెగా టోర్నీలో సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న శ్రీలంక సెమీస్‌ చేరాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ (జూలై 1న), భారత్‌  (జూలై 6న)లపై తప్పనిసరిగా గెలవడంతోపాటు పాక్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ జట్లు ఆడే మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాలి. 
 
చెస్టర్‌ లీ స్ట్రీట్‌:
బౌలింగ్‌లో చక్కటి ప్రదర్శనకు తోడు ఇద్దరు సీనియర్ల బ్యాటింగ్‌ దక్షిణాఫ్రికాకు వరల్డ్‌ కప్‌లో రెండో విజయాన్ని అందించాయి. శుక్రవారం ఇక్కడి రివర్‌సైడ్‌ గ్రౌండ్‌లో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 49.3 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. అవిష్క ఫెర్నాండో (29 బంతుల్లో 30; 4 ఫోర్లు), కుశాల్‌ పెరీరా (34 బంతుల్లో 30; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం దక్షిణాఫ్రికా 37.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (103 బంతుల్లో 96 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), హషీం ఆమ్లా (105 బంతుల్లో 80 నాటౌట్‌; 5 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 175  పరుగులు జోడించడం విశేషం.  

30 దాటలేదు...
శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోర్లు చేశారు. కానీ ఒక్కరు కూడా 30 పరుగులు దాటలేకపోయారు. ఇదీ ఆ జట్టు బ్యాటింగ్‌ పరిస్థితి! ఇన్నింగ్స్‌ తొలి బంతికే కెప్టెన్‌ కరుణరత్నే (0)ను ఔట్‌ చేసి రబడ దక్షిణాఫ్రికాకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ దశలో కుశాల్, ఫెర్నాండో ఎదురుదాడికి దిగి కొన్ని చూడచక్కటి షాట్లు ఆడారు. వీరిద్దరి భాగస్వామ్యమే లంక ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ అంశం. ఈ జోడి రెండో వికెట్‌కు 58 బంతుల్లోనే 67 పరుగులు జోడించింది. అయితే తన వరుస ఓవర్లలో వీరిద్దరిని ఔట్‌ చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ప్రిటోరియస్‌ దెబ్బ కొట్టాడు. ఫెర్నాండో మిడాఫ్‌లో క్యాచ్‌ ఇవ్వగా... కుశాల్‌ బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. ఐదు పరుగుల వ్యవధిలో వీరు వెనుదిరిగిన తర్వాత లంక బ్యాటింగ్‌ మరింత పేలవంగా సాగింది. మాథ్యూస్‌ (29 బంతుల్లో 11; ఫోర్‌) విఫలమవగా... సఫారీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేని కుశాల్‌ మెండిస్‌ (51 బంతుల్లో 23; 2 ఫోర్లు), ధనంజయ డి సిల్వా (41 బంతుల్లో 24; 2 ఫోర్లు), జీవన్‌ మెండిస్‌ (46 బంతుల్లో 18; ఫోర్, సిక్స్‌) పెద్ద సంఖ్యలో బంతులు వృథా చేశారు. ఒక దశలో 58 బంతుల పాటు లంక ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయింది. చివర్లో చెలరేగగలడని భావించిన తిసారా పెరీరా (25 బంతుల్లో 21) ప్రభావం చూపలేకపోవడంతో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. 

భారీ భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ ఓపెనర్లు డి కాక్‌ (15), ఆమ్లా వేగంగా ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. మలింగ లయ తప్పడంతో అతని తొలి 2 ఓవర్లలో 4 ఫోర్లతో 19 పరుగులు రాబట్టారు.  మలింగ అద్భుత యార్కర్‌తో డి కాక్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మాత్రం లంకకు మళ్లీ ఎలాంటి అవకాశం దక్కలేదు. ఆమ్లా, డు ప్లెసిస్‌ చక్కటి సమన్వయంతో ప్రశాంతంగా పరుగులు తీస్తూ జట్టును గెలుపు దిశగా నడిపించారు. ఈ జోడీని విడదీసేందుకు లంక బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో ఆమ్లా 56 బంతుల్లో, డు ప్లెసిస్‌ 70 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 68 పరుగుల వద్ద ఆమ్లాను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా దక్షిణాఫ్రికా సమీక్ష కోరి సానుకూల ఫలితం పొందింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడి ఆమ్లా, ప్లెసిస్‌ మిగతా పనిని పూర్తిచేశారు.

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: కరుణరత్నే (సి) డు ప్లెసిస్‌ (బి) రబడ 0; కుశాల్‌ పెరీరా (బి) ప్రిటోరియస్‌ 30; ఫెర్నాండో (సి) డు ప్లెసిస్‌ (బి) ప్రిటోరియస్‌ 30; కుశాల్‌ మెండిస్‌ (సి) మోరిస్‌ (బి) ప్రిటోరియస్‌ 23; మాథ్యూస్‌ (బి) మోరిస్‌ 11; ధనంజయ డి సిల్వా (బి) డుమిని 24; జీవన్‌ మెండిస్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) మోరిస్‌ 18; తిసారా పెరీరా (సి) రబడ (బి) ఫెలుక్‌వాయో 21; ఉడాన (సి అండ్‌ బి) రబడ 17; లక్మల్‌ (నాటౌట్‌) 5; మలింగ (సి)
డు ప్లెసిస్‌ (బి) మోరిస్‌ 4; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 203.  
వికెట్ల పతనం: 1–0, 2–67, 3–72, 4–100, 5–111, 6–135, 7–163, 8–184, 9–197, 10–203. 

బౌలింగ్‌: రబడ 10–2–36–2, మోరిస్‌ 9.3–0–46–3, ప్రిటోరియస్‌ 10–2–25–3, ఫెలుక్‌వాయో 8–0–38–1, తాహిర్‌ 10–0–36–0, డుమిని 2–0–15–1.  

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డి కాక్‌ (బి) మలింగ 15; ఆమ్లా (నాటౌట్‌) 80; డు ప్లెసిస్‌ (నాటౌట్‌) 96; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (37.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 206.  
వికెట్ల పతనం: 1–31. 
బౌలింగ్‌: మలింగ 10–1–47–1, ధనంజయ 4–0–18–0, లక్మల్‌ 6–0–47–0, తిసారా పెరీరా 5.2–1–28–0, జీవన్‌ మెండిస్‌ 7–0–36–0, ఉడాన 5–0–29–0.   

తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు మైదానంలో అంపైర్లు, ఆటగాళ్లు ఇలా...

మరిన్ని వార్తలు